బీజేపీ ఎమ్మెల్యేల్లో గందరగోళం.. ఫ్లోర్ లీడర్ లేకుండానే అసెంబ్లీకి

బీజేపీ ఎమ్మెల్యేల్లో గందరగోళం.. ఫ్లోర్ లీడర్ లేకుండానే  అసెంబ్లీకి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లను గెలుచుకున్న బీజేపీలో గందరగోళం నెలకొంది. అందుకు కారణం.. ఇప్పటివరకు శాసనసభపక్ష నేతను ఎన్నుకోకపోవడమే.  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 8వ తేదీ గురువారం ప్రారంభం కానున్నాయి.

మొదటి శాసనసభ సమావేశాల్లో ఫ్లోర్ లీడర్ లేకుండానే బీజేపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీకి హాజరయ్యారు. ఈసారి కూడా బీజేపీలో అదే సీన్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. శాసనసభపక్ష నేత పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫ్లోర్ లీడర్ పదవి కోసం పోటీపడే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపంతో ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా వారు ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 గత అసెంబ్లీ సమావేశాల్లో ఓ ప్రవేటు హోటల్లో సమావేశమై  ఎమ్మెల్యేలందరూ కలిసి అసెంబ్లీకి వచ్చారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా బీజేపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఉండడంతో.. ఈసారి కూడా శాసనసభ పక్షనేత లేకుండానే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.