స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ డిసెంబర్ 13న నామినేషన్ల స్వీకరణ.. ఎల్లుండి ఎన్నిక

స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ డిసెంబర్ 13న నామినేషన్ల స్వీకరణ.. ఎల్లుండి ఎన్నిక

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 13న ఉదయం 10‌‌‌‌.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్లు దాఖలుకు అవకాశం ఇచ్చారు. 14న ఉదయం 10.30 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. స్పీకర్ పదవి కోసం ఒకరి కన్నా ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తారు.

ఒక్కరే నామినేషన్ వేస్తే ఆయననే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. తర్వాత అదే రోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించి, కొత్త స్పీకర్ బాధ్యతలు చేపడతారు. కాంగ్రెస్ పార్టీ తమ స్పీకర్ అభ్యర్థిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌ను ఇప్పటికే ప్రకటించింది.

బుధవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన మినహా ఇంకెవరూ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవచ్చని తెలుస్తోంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. స్పీకర్‌‌‌‌గా పోటీ చేసే అభ్యర్థిని ఇతర ఎమ్మెల్యేలు మాత్రమే ప్రతిపాదిస్తూ సంతకం చేయాలని, తమకు తాముగా ఎవరైనా ప్రపోజ్ చేసుకుంటే ఆ నామినేషన్‌‌ను పరిగణనలోకి తీసుకోబోమని నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. స్పీకర్​పదవికి ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడి సమాన సంఖ్యలో ఓట్లు సాధిస్తే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తామని వెల్లడించారు.