ఇవాళ్టి (ఆగస్ట్ 30) నుంచి అసెంబ్లీ స్టార్ట్.. సభ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్

ఇవాళ్టి (ఆగస్ట్ 30) నుంచి అసెంబ్లీ స్టార్ట్.. సభ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్
  • కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • తొలిరోజు మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం 
  • మూడు లేదా నాలుగు రోజులు జరగనున్న సమావేశాలు 
  • నేడు కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‎కు అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి మండలిలో సంతాపం ప్రకటించి తొలిరోజు సభను వాయిదా వేయనున్నారు. ఆ తరువాత బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో సమావేశాల అజెండా, సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి మూడు, నాలుగు రోజుల పాటే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం మిలాద్ ఉన్ నబీ పండగ ఉండడం, ఆ తరువాత శనివారం నిమజ్జనం ఉండటంతో పోలీస్​ బందోబస్తు, ఇతర ఏర్పాట్ల నేపథ్యంలో గురువారం వరకే సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఆదివారం సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే అదే రోజు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన 665 పేజీల పూర్తి నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కాళేశ్వరం కమిషన్​రిపోర్ట్‎పై కుస్తీ పడుతున్నాయి. అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్​పై చర్చ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో కమిషన్ రిపోర్ట్‎కు అనుగుణంగా చర్యలు తీసుకునేలా కేసును సిట్ లేదా సీఐడీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, వస్తున్న అడ్డంకులపై అసెంబ్లీ సమావేశాల్లో  ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఒకవేళ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తే అన్ని పార్టీలు అలాగే ముందుకు రావాలని కోరనున్నట్లు సమాచారం.  

మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్..  

తొలిరోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడే కమిటీ హాల్‎లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర  మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై పీఏసీ మంత్రుల కమిటీ ఏర్పాటు చేయగా.. మూడు ప్రతిపాదనలను సూచించింది. ఇందులో ప్రత్యేక జీవోతో రిజర్వేషన్లు పెంచడం లేదా పార్టీ పరంగా అమలు చేయడం, మూడోది బీసీ బిల్లులు, ఆర్డినెన్స్​పై న్యాయ పరంగా పోరాటం చేయడం ఉన్నాయి. 

అలాగే హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణతో పాటు రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రాసెస్​ను వేగవంతం చేసింది. ప్రభుత్వం రిజర్వేషన్లపై గెజిట్ ఇవ్వగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో వచ్చే నెల మొదటి వారంలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.