బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్లో తెలంగాణకు స్వర్ణాలు

బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్లో తెలంగాణకు స్వర్ణాలు

అహ్మదాబాద్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు.  బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో  తెలంగాణ జట్టు స్వర్ణం సాధించింది. ఫైనల్లో తెలంగాణ 3-0తో కేరళను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి-సిక్కి రెడ్డి జంట 21-15, 14-21, 21-14తో అర్జున్‌-ట్రీసా జాలీపై గెలిచింది.  మెన్స్ సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 18-21, 21-16, 22-20తో ప్రణయ్‌పై విజయం సాధించగా..ఉమెన్స్  సింగిల్స్‌లో సామియా 21-5, 21-12తో గౌరికృష్ణపై గెలుపొందింది. 

బాస్కెట్ బాల్లో స్వర్ణం
ఉమెన్స్ 3-3 బాస్కెట్‌బాల్‌ ఫైనల్లో తెలంగాణ 17-13తో కేరళపై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. 6 పాయింట్లు సాధించిన పుష్ప.. టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. అటు మహిళల స్విమ్మింగ్‌ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో హైదరాబాద్‌ యువ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ 9.23 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకం దక్కించుకుంది. మెన్స్ పురుషుల రోయింగ్‌ ఎమ్‌-8 కాక్స్‌డ్‌ కేటగిరీలో బాలకృష్ణ రెడ్డి, నితిన్‌ కృష్ణ, సాయిరాజ్‌, చరణ్‌సింగ్‌, మహేశ్వర్‌ రెడ్డి, గజేంద్ర యాదవ్‌, నవదీప్‌, హర్‌దీప్‌ సింగ్‌తో కూడిన తెలంగాణ టీమ్‌ కాంస్య పతకం సాధించింది.

ఏపీ ప్లేయర్లకు పతకాల పంట...
జాతీయ క్రీడల్లో ఉమెన్స్ జిమ్నాస్టిక్స్‌లో ట్రంపోలిన్‌ కేటగిరీలో విజయవాడ అమ్మాయి షేక్‌ యాసిన్‌ రజతం సొంతం చేసుకుంది. హెప్టాథ్లాన్‌లో విజయవాడకు చెందిన సౌమ్య కాంస్య పతకం దక్కించుకుంది. ఉమెన్స్ వెయిట్‌ లిఫ్టింగ్‌ 87 కిలోల విభాగంలో విజయనగరం అమ్మాయి సత్యజ్యోతి బ్రౌంజ్ మెడల్ సాధించింది. సత్య స్నాచ్‌లో 90 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కిలోలు, మొత్తం 201 కిలోల బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. ఆర్చరీ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఏపీ ఫైనల్ చేరడంతో..పతకం ఖాయమైంది.