Malaysia Masters 2024: మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో పీవీ సింధు.. చైనా క్రీడాకారిణితో తుది పోరు

Malaysia Masters 2024: మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో పీవీ సింధు.. చైనా క్రీడాకారిణితో తుది పోరు

భారత షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. శనివారం (మే 25) జరిగిన సెమీఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌ను 13-21, 21-16, 21-12 స్కోరుతో ఓడించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ.. ఆ తరువాత పుంజుకొని  సింధు వరుస సెట్లలో విజయం సాధించింది. 88 నిమిషాల పాటు ఈ గేమ్ సాగింది. బుసానన్‌పై 19 మ్యాచ్‌ల్లో సింధుకు ఇది 18వ విజయం.  

అంతకుముందు సింధు శుక్రవారం(మే 24) క్వార్టర్స్‌లో చైనా టాప్‌సీడ్‌ హాన్‌ యుయిను 21-13, 14-21, 21-12తో ఓడించింది. ఇది తన కెరీర్‌లో 452వ విజయం. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన షట్లర్‌గా సైనా నెహ్వాల్‌ (451) రికార్డును అధిగమించింది. పీవీ సిందు ఈ ఏడాదిలో బ్యాడ్మింట‌న్ టోర్నీలో ఫైన‌ల్లోకి ప్రవేశించ‌డం ఇదే తొలిసారి. చివ‌రిసారి 2022 సింగపూర్ ఓపెన్‌ను గెలుచుకున్న భారత షట్లర్.. గతేడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచింది.

వాంగ్ జి యితో అమీ తుమీ

ఫైనల్లో సింధు  చైనా రెండవ సీడ్ వాంగ్ జి యితో తలపడనుంది. ఇక్కడ యాదృచ్ఛికం ఏమిటంటే సింధు నెగ్గిన 2022 సింగపూర్ ఓపెన్ ఫైనల్ ప్రత్యర్థి వాంగ్ జి యినే కావడం గమనార్హం. మరోసారి ఆమెను ఓడించి టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది.