అబిడ్స్, వెలుగు: బార్ అండ్ రెస్టారెంట్లపై రాష్ట్ర ప్రభుత్వం విధించనున్న ప్రివిలేజ్ టాక్స్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ ఎదుట బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 1న జరిగిన క్యాబినెట్ సమావేశంలో లైసెన్స్ ఫీజు శ్లాబుల ఆధారంగా బార్లపై 8 నుంచి 16 శాతం వరకు ప్రివిలేజ్ టాక్స్ విధించాలని నిర్ణయించారని తెలిపారు. దీంతో ఒక్కో బార్పై ఏడాదికి రూ.30 లక్షలకు పైగా అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,150కిపైగా బార్లు ఉండగా, వీటిలో 80 నుంచి 85 శాతం సాధారణ, మధ్యతరగతి యాజమాన్యాలవే ఉన్నాయని చెప్పారు.
ఇప్పటికే వైన్స్ పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపుల వల్ల బార్ల వ్యాపారం తగ్గిపోయిందన్నారు. హైదరాబాద్ పరిధిలో 2025లోనే లైసెన్స్ ఫీజు రూ.4 లక్షలు పెంచారని గుర్తుచేశారు. ప్రస్తుతం 14.5 శాతంగా ఉన్న రిటైలర్ మార్జిన్ కొత్త పన్నుతో 4 శాతం నుంచి మైనస్ 1.5 శాతానికి పడిపోతుందన్నారు. పన్నుల భారం భరించలేక మద్యం ధరలు పెంచితే వినియోగదారులు వైన్ షాపులు, బెల్ట్ షాపుల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రివిలేజ్ టాక్స్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
