ప్రచారానికి కేసీఆర్ వస్తరా .. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో టెన్షన్

ప్రచారానికి కేసీఆర్ వస్తరా .. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో టెన్షన్
  • ఫోన్​ట్యాపింగ్, లిక్కర్​స్కాం కేసులతో ఆందోళన
  • ఎంపీ ఎన్నికల టైమ్ లో వెలవెలబోతున్న తెలంగాణ భవన్ 

హైదరాబాద్ ,వెలుగు : ఎంపీ ఎన్నికల్లో పోటీచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ఇపుడు కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. టికెట్ అయితే వచ్చింది, పోటీ చేస్తున్నం.. మరి ప్రచారానికి పార్టీ చీఫ్ కేసీఆర్ వస్తరా? రారా? అని  ఆందోళన చెందుతున్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం, లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నా కేసీఆర్ సైలెంట్ మోడ్​లో ఉండడంపై క్యాడర్​లో ఆందోళన నెలకొంది. కేసీఆర్ ప్రచారానికి వస్తే గెలుపు సంగతి తరువాత ప్రత్యర్థులకు పోటీ ఇవ్వటంతో పాటు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు దక్కించుకుంటామని అభ్యర్థులు సన్నిహితులతో అంటున్నట్లు సమాచారం. కేసీఆర్ ప్రచారానికి వస్తే ఆయన స్పీచ్ లు తమకు కలిసొస్తాయని చెబుతున్నారు.

కీలక అంశాలపై సైలెంట్ 

రాష్ట్రంలో ఎన్నో కీలక పరిణామాలు జరుగుతున్నా కేసీఆర్ స్పందించకపోవటం పార్టీ కార్యకర్తలు, నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కవితను అరెస్ట్ చేసినా ఆయన స్పందించలేదు. కేసీఆర్ సైలెంట్ గా ఉండడం కవిత స్కామ్ కు పాల్పడినట్లు ఆమె తండ్రే ఒప్పుకున్నారనే మెసేజ్ వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన కడియం కావ్య, రంజిత్ రెడ్డిలు పార్టీ మారినా మాట్లాడకపోవడం పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్​ట్యాపింగ్​కేసుపై కూడా కేసీఆర్​స్పందించకపోవడం పార్టీకి బాగా డ్యామేజీ చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కీలకమైన అంశాలపై అధినేత సైలెంట్ గా ఉండడంతో పార్టీ భవిష్యతుకు నష్టం కలుగుతున్నదని టెన్షన్​పడుతున్నరు.

ఫామ్​హౌస్ కే పరిమితం

అధికారం కోల్పోయి.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఫామ్​హౌస్​లోనే ఎక్కువ ఉంటున్నారు. పార్టీ లో చేరికలు, ఎంపీ స్థానాలపై రివ్యూలు ఇలా అన్ని అక్కడే జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో నామినేషన్ల ప్రాసెస్ స్టార్ట్ అవుతున్న టైమ్ లో కూడా తెలంగాణ భవన్ వెలవెల బోతున్నది. రివ్యూలకు కూడా రాకపోవడంతో అభ్యర్థులు, పార్టీ నేతలు, కార్యకర్తలు నిరాశ చెందుతున్నట్లు తెలుస్తున్నది.