బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఖరారు : ఎన్. రామచందర్ రావు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఖరారు :  ఎన్. రామచందర్ రావు
  •     198 మందితో జంబో లిస్ట్ విడుదల

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సోమవారం ప్రకటించారు. 198 మందితో జంబో జాబితాను విడుదల చేశారు. ఇందులో 20 మందిని శాశ్వత ఆహ్వానితులుగా, 116 మందిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, 62 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. 

సీనియర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రముఖులకు ఈ కమిటీలో చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల జాబితాలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావుతో కలిపి 62 మందికి చోటు దక్కింది. 

కిషన్ రావు, అమరసింగ్ తిలావత్, విజయ రామారావు, సత్యనారాయణ, సుద్దాల దేవియా, మర్రి శశిధర్ రెడ్డి, సి. కృష్ణ యాదవ్, చాడ సురేశ్​రెడ్డి వంటి మాజీ మంత్రులతో పాటు మాజీ ఎంపీలు బీబీ పాటిల్, పోతుగంటి రాములు, వెంకటేశ్ నేతలకు స్థానం కల్పించారు. నటులు జీవిత రాజశేఖర్, శివకృష్ణ, లక్ష్మీకాంత్ రావు, పసునూరి శ్రీనివాస్ వంటి వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఎ. నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కపిలవాయి దిలీప్ కుమార్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, అన్నపూర్ణమ్మ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు.