షరతుల ఎవుసం కమీషన్ల కోసమే.!

షరతుల ఎవుసం కమీషన్ల కోసమే.!

హైదరాబాద్, వెలుగుసాగు నీటి ప్రాజెక్టుల్లో కమీషన్లు కొట్టేసినట్లే, పంటల పేరుతోనూ దోచుకునేందుకే సీఎం కేసీఆర్ షరతుల ఎవుసం విధానాన్ని తీసుకొచ్చారని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఎరువులు, విత్తనాల కంపెనీలతో సీఎం ఒప్పందాలు చేసుకొని ఉంటారని, అందుకే పంటల సాగు విధానమంటూ కొత్త దుకాణం తెరిచారని విమర్శించారు. రైతుబంధును ఎగ్గొట్టేందుకే కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రుణమాఫీ పేరుతో రైతులను మోసగించిన కేసీఆర్… ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ పూర్తిగా ఎక్కడ అమలైందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్నది నిర్బంధ సాగు అని, దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. సీఎం మోనార్క్ గా వ్యవహరిస్తున్నారని, ఆయన మాట వింటే తెలంగాణ రైతుల బతుకులు బర్బాజ్ అవుతాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు వరద నీళ్లు పంటలకు మళ్లినా… అవి కాళేశ్వరం నీళ్లేనని నమ్మించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు. సంజయ్ ఆదివారం జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

మీరెట్ల నంబర్ వన్?

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్ వన్ సీఎం కేసీఆర్ చెబుతున్నారని, ఇది ఎలా నిర్ధారించారని సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్​ఇండియా (ఎఫ్​సీఐ) జీఎం ఎలా చెబుతారని అడిగారు. కేసీఆర్ కు ఎఫ్ సీఐ జీఎంకు ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.108 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్న పంజాబ్ ముందుంటదా? లేక 66 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిన తెలంగాణ ముందుంటదా? అని సంజయ్ నిలదీశారు. రైస్ మిల్లర్లకే ఇంకా ధాన్యం చేరలేదని, మరి ఎఫ్ సీఐ ఎలా కొనుగోలు చేసిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎకరాకు రూ.లక్ష వస్తే ముక్కు నేలకు రాస్తా...

రుణమాఫీ చేస్తానని… ఫ్రీగా ఎరువులు, విత్తనాలు ఇస్తానని 2017 ఏప్రిల్ లోనే సీఎం కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చారని సంజయ్ గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెబుతున్న తెలంగాణ సోనా ఎఫ్ సీఐలో బి గ్రేడ్ అని, మరి ఆ పంటను కేసీఆర్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చెప్పాలన్నారు. షరతుల ఎవుసంతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తాయని చెపుతున్న సీఎం…  అది ఏ లెక్క ప్రకారం వస్తదో చెప్పాలన్నారు. పెట్టుబడి పోను రూ.15 వేల కంటే ఎక్కువ మిగలవని సంజయ్ చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లు ఎకరానికి రూ.లక్ష వస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే సీఎం ముక్కు నేలకు రాస్తారా? సవాల్ విసిరారు.

రైతులు నష్టపోతే ప్రభుత్వానిదే బాధ్యత...

చెప్పిన పంటలే వేయాలంటున్న ప్రభుత్వం… రైతులు నష్టపోతే బాధ్యత వహించాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు. చెప్పిన పంట వేస్తే ఎంత మద్దతు ధర ఇస్తారో ముందే ప్రకటించాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. పంటల మార్పిడికి బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే అది సైంటిఫిక్ ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో భూసార పరీక్షలు చేశారని, ఏ పంటకు ఏ భూమి అనుకూలమని ఎన్ని సర్వేలు చేశారని ప్రశ్నించారు. రైతులకు భూసార పరీక్షల కార్డులు ఇవ్వాలని, పంటల సాగుపై వెంటనే గైడ్ లైన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఊర్లలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏమైనా కేంద్రంపై నడుస్తుందా, అన్ని కేంద్రమే ఇస్తే మరి రాష్ట్రం చేసేదేమిటని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకుంటే ఊరుకునేది లేదని, బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

7 జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు