బీజేపీ గెలిస్తే పాత బస్తీకి మెట్రో రైల్

బీజేపీ గెలిస్తే పాత బస్తీకి మెట్రో రైల్

హైదరాబాద్‌: పాతబస్తీకి మెట్రో రైల్ వేయకుండా ఎంఐఎం పార్టీ అడ్డుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీకి కూడా మెట్రో రైలు తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. మెట్రో రైలు వల్ల అక్కడి హిందూ, ముస్లిం యువకులకు ఉద్యోగులు వస్తాయని తెలిపారు.  నిన్న చార్మినార్‌‌ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసి ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ఆదివారం మధ్యాహ్నానికి షేక్ పేట్ ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ పాత బస్తీకి మెట్రో రైలు ఎందుకు రాలేదో ఎంఐఎం చెప్పాలన్నారు. పాతబస్తీని అభివృద్ధి ఎందుకు చేయటం లేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాతబస్తీలో హిందూ సమాజానికి  బీజేపీ అండగా ఉంటుందని, పాతబస్తీలో బీజేపీ కోసం హిందూ సమాజం సంఘటితమవుతోందని అన్నారు. గో రక్షణ కోసం కృషి చేస్తోన్న ఎమ్మెల్యే రాజసింగ్ పై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. నెలలో 20 రోజులు రాజాసింగ్ కోర్టులకు వెళ్తున్నడాంటే ధర్మం కోసమేనని ఆయన తెలిపారు. అక్టోబర్ 2 వరకు జరిగే యాత్రలో అందరూ స్వచ్చందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివస్తోన్న భాగ్యనగర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. 

అధికారంలోకి వచ్చాక తొలి బహిరంగ సభ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే

తెలంగాణలో కేసీఆర్ అవినీతి సర్కారును గద్దె దించేవరకూ తమ పోరాటం ఆగదని బండి సంజయ్  చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి సభ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే జరుగుతుందని ఆయన ప్రకటించారు. 2023 లో గోల్కొండ కోట మీద కాషాయపు జెండా ఎగురవేస్తామన్నారు. దేనికి భయపడని పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడకి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు స్వఛ్చందంగా పాల్గొంటున్నారని, తన పాదయాత్రలో పాల్గొంటున్న కార్పొరేటర్లకు, కార్యకర్తల శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని బండి సంజయ్ అన్నారు.