
వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని.. రాజకీయాల్లో అవసరం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని... నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారని అన్నారు.
బీసీలకు ఇప్పటికే బీసీ-బీ, బీసీ-ఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని... రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలని... రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదని అన్నారు రామచందర్ రావు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం యూరియా ఇవ్వడం లేదు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. రైతుల ఇబ్బందులకు నిజమైన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు.
మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా సరఫరా సరిగ్గా జరగడం లేదని... ఎరువుల దుకాణాల్లో యూరియా దొరక్కపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సిగ్గుచేటని అన్నారు రామచందర్ రావు.రాబోయే రోజుల్లో ఏ శక్తి అడ్డొచ్చినా, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తామని.. అనంతగిరి పర్యాటక కేంద్రంగా దక్షిణ ఊటీగా ప్రసిద్ధి చెందిందని, అనంత పద్మనాభస్వామి ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో వికారాబాద్‌లో బీజేపీ మూడు అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని అన్నారు రామచందర్ రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారని.. గత బీఆర్ఎస్,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ ఒకే తీరుగా పాలనలో వైఫల్యం చెందాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితబంధు, రైతుబంధు అంటూ మాయమాటలు చెప్పి, సరిగ్గా అమలు చేయక మోసం చేసిందని... అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుభరోసా కింద ప్రతి రైతుకి 15 వేలు ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చింది కానీ.. వాస్తవానికి రెండు విడతల్లో కేవలం రూ.6 వేలు మాత్రమే ఇచ్చారని.. ఇది రైతులను మోసం చేయడమేనని అన్నారు.
ALSO READ : హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై కమీషనర్ సీవీ ఆనంద్
వికారాబాద్‌లో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు ఖాయమని.. విద్యావంతులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాన్ని గుర్తించారని అన్నారు.రిటైర్డ్ ఎంప్లాయిస్ కు సక్రమంగా పెన్షన్ ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పటికే 12 లక్షల కోట్లను కేటాయించిందని.. తెలంగాణ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని అన్నారు.ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజల ఇళ్లకు వెళ్లి కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులు వివరించాలని అన్నారు రామచందర్ రావు.