తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హౌస్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హౌస్ అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావును మంగళవారం (ఆగస్ట్ 12) తెల్లవారుజూమున తార్నాకలోని ఆయన నివాసంలో ఓయూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని వివాదస్పదంగా మారిన పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం (ఆగస్ట్ 12)  హిందూ సంఘాలు కుంకుమార్చాన పూజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కుంకుమార్చాన కార్యక్రమానికి రామచందర్ రావు, నగరంలోని పలువురు బీజేపీ కార్పొరేటర్లు తరలి వెళ్లే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా టీబీజేపీ చీఫ్‎ను హైదరాబాద్‎లోని ఆయన నివాసంలోనే  గృహనిర్భంధం చేశారు. పలువురు కార్పొరేటర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. 

ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ..పెద్దమ్మ టెంపుల్ వద్ద అక్కడి ప్రజలు కుంకుమార్చాన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను హౌస్ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీన్ని బీజేపీ, హిందువులుగా పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ కార్యక్రమాలను, హిందువుల పూజలను జరుపుకోనివ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. 

తనతో పాటు కొంతమంది బీజేపీ కార్పొరేటర్ల ను, నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. హిందువులకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా చేసుకునే హక్కు హిందువులకు ఉందన్నారు. హిందువులు పూజలకు వెళ్ళవద్దు, గుళ్ళు కూల్చి వేస్తుంటే వ్యతిరేకించవద్దు అనే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు.