తెలంగాణలో గెలవాలంటే.. ముందు హైదరాబాద్లో గెలవాలి! : రాంచందర్ రావు

తెలంగాణలో గెలవాలంటే.. ముందు హైదరాబాద్లో గెలవాలి! : రాంచందర్ రావు
  •     డివిజన్ల వారీగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి: రాంచందర్​ రావు 
  •     ఎనిమిది జిల్లాల ముఖ్య నేతలతో భేటీ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే.. ముందు హైదరాబాద్ నగరంలో గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్​ లో ప్రస్తుతం 30 దాకా ఎమ్మెల్యే స్థానాలున్నాయని.. తాజాగా అవి 36 దాకా పెరగొచ్చని తెలిపారు. నాలుగోవంతు సీట్లున్న హైదరాబాద్​ పై ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉందని.. దీన్ని గుర్తు పెట్టుకోవాలని నేతలకు స్పష్టం చేశారు. 

మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు అధ్యక్షతన జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది జిల్లాల ముఖ్య నాయకులతో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేపడుతున్న వార్డుల విస్తరణ, సర్కార్ అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. 

ఈ సందర్భంగా రాంచందర్​రావు మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో జనం ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల విస్తరణ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. బల్దియా పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అస్త్రంగా చేసుకొని.. రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డివిజన్ల వారీగా స్థానిక సమస్యలపై సీనియర్ లీడర్లను కలుపుకొని పోయి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఆందోళనలు చేపట్టాలని సూచించారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లూ బీఆర్ఎస్ గెలిచిందని.. కానీ, జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో పరిస్థితి మారిపోయిందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్ గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్, ప్రకాశ్ రెడ్డి, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.