బండి సంజయ్​కి14 రోజుల రిమాండ్

బండి సంజయ్​కి14 రోజుల రిమాండ్
  • కరీంనగర్​ జైలుకు తరలింపు
  • ప్రశాంత్​, మహేశ్​, శివగణేశ్​ కూడా..
  • కుట్రపూరితంగానే టెన్త్ పేపర్ లీక్​ చేశారని రిమాండ్​ రిపోర్టులో పోలీసుల ప్రస్తావన

హనుమకొండ/ వరంగల్/ కరీంనగర్​, వెలుగు: టెన్త్​ క్లాస్​ పేపర్​ లీక్​ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​కి హనుమకొండ ప్రిన్సిపల్​ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్​ 14 రోజుల రిమాండ్​ విధించారు. సంజయ్​ను ఏ1 గా చేర్చిన పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్​ 120 బీ, 420, 447, 505(1)(బీ), తెలంగాణ స్టేట్​ పబ్లిక్​ ఎగ్జామినేషన్​ ప్రివెన్షన్​ ఆఫ్​ మాల్​ ప్రాక్టీసెస్​ యాక్ట్ -1997లోని సెక్షన్​ 5, ఐటీ యాక్ట్​ సెక్షన్​ 66 డి ప్రకారం కేసులు నమోదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్​లో అరెస్ట్​ చేసిన పోలీసులు.. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో 
కోర్టుకు తీసుకువచ్చారు.

ప్రిన్సిపల్​ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్​కు ఎనిమిది పేజీల రిమాండ్​ రిపోర్ట్ సబ్మిట్​ చేశారు. అనంతరం పేపర్​ లీక్​ ఘటనలో బండి సంజయ్​ ఏ1 అని  పోలీస్​ తరఫున లాయర్లు వాదించగా.. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సంజయ్​ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ మేరకు రిమాండ్​ ను రిజెక్ట్ చేయాల్సిందిగా మెమో ఫైల్​ చేశారు. అయితే రిమాండ్​ రిపోర్ట్ పరిశీలించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్​ దాదాపు రెండు గంటల తర్వాత బండి సంజయ్​తోపాటు ఏ2 బూరం ప్రశాంత్​, ఏ3 గుండబోయిన మహేశ్​, ఏ5 మౌటం శివగణేశ్​కు 14 రోజుల రిమాండ్​ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నమే పాలకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బండి సంజయ్ తో పాటు మిగతా వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. రాత్రి వారందరినీ కరీంనగర్​ జైలుకు తరలించారు. మరో నిందితుడు మైనర్ (16)​ కావడంతో జువైనల్​ హోంకు తరలించారు. జడ్జి ఈ నెల 19 వరకు రిమాండ్ విధించగా.. బుధవారం సెలవుదినం కావడంతో బండి సంజయ్​ తరఫు లాయర్లు బెయిల్​ పిటిషన్​ దాఖలు చేయలేకపోయారు. గురువారం వరంగల్ పోలీసులు బండి సంజయ్​ కస్టడీకి పిటిషన్​ దాఖలు చేయనుండగా..  బండి సంజయ్​ తరఫు లాయర్లు బెయిల్​ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కుట్రపూరితంగా ముందస్తు ప్లాన్ ప్రకారం టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని రిమాండ్​ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతోనే ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని రూమర్స్ వ్యాప్తి చేశారని, ఇదంతా బండి సంజయ్ దిశానిర్దేశం ప్రకారం జరిగిందని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి ప్రతిష్ట దిగజార్చేందుకు ఏప్రిల్ 3న జరిగిన తెలుగు పేపర్ లీకేజీ ఘటనను విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు 4న జరిగిన హిందీ పరీక్షా పత్రాన్ని సర్క్యులేట్ చేయాలని ప్రశాంత్​కు బండి సంజయ్ సూచించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిని రిమాండ్​కు తరలించకపోతే భవిష్యత్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ మరిన్ని లీకేజీ ఘటనలు జరగొచ్చని, వీరి వల్ల విద్యార్థుల భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.

రిమాండ్​ రిపోర్టులో ఏముందంటే..!
‘‘ఈ నెల 4న షెడ్యూల్ ప్రకారం కమలాపూర్ జెడ్పీ(బాయ్స్) హైస్కూల్ లో టెన్త్ క్లాసు హిందీ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల 3న  తెలుగు పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ లీకేజీలాగే 4న జరిగే హిందీ పేపర్ ను కూడా లీక్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వం పరువు తీయాలని బూరం ప్రశాంత్ ను బండి సంజయ్ ఆదేశించారు. ఈ విషయమై కమలాపూర్ కు చెందిన బీజేపీ కార్యకర్త మనోజ్ తో వాట్సప్ లో చర్చించారు. వారి ప్లాన్ ప్రకారం.. దూలం శ్రీకాంత్ తోపాటు మైనర్ కమలాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ కు వెళ్లి కాంపౌండ్ వాల్‌పై నుంచి దూకి స్కూల్ లో కి చొరబడ్డారు. అనంతరం చెట్టు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ లోని రూమ్ నంబర్ 3లోకి వెళ్లి  మైనర్  తన సెల్ ఫోన్ లో 9.45 గంటలకు ఓ విద్యార్థి క్వశ్చన్ పేపర్ ను ఫొటో తీసుకున్నాడు. మైనర్ ఆ ఫొటోను మౌటం శివ గణేశ్​కు పంపాడు. శివగణేశ్​ ఎస్సెస్సీ 2019--–20 వాట్సప్ గ్రూపులో ఫార్వార్డ్ చేశాడు. గ్రూపులోని చందు అనే మెంబర్ గుండబోయిన మహేశ్​కు పంపాడు. మహేశ్​ తన ఫోన్ నుంచి బూర ప్రశాంత్ కు ఫార్వార్డ్ చేశాడు. ప్రశాంత్ ఆ ఫొటోలను శ్రీను ఫ్రెండ్స్ అనే గ్రూపులో ఉదయం 10.46 గంటలకు పోస్టు చేశాడు. అలాగే అతడు సుమారు 11.11 గంటలకు ‘వరంగల్ లో ఎస్సెస్సీ హిందీ పేపర్ లీక్.. ఉదయం 9.30కే లీకైన ప్రశ్నపత్రం.. వరుసగా రెండోరోజు ప్రశ్నపత్రం లీకవ్వడంతో తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు.. ఎస్సెస్సీ స్టూడెంట్స్ వాట్సప్ గ్రూప్ లో ప్రత్యక్షమైన హిందీ ప్రశ్నపత్రం’ అనే టెక్స్ట్ తో బ్రేకింగ్ న్యూస్ ఐటెంగా ప్రిపేర్ చేసి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు 10.41 గంటలకు, బండి సంజయ్ కు 11.24 గంటలకు, రాజు(ఈటల పీఏ), నరేందర్ (ఈటల పీఏ), నరేశ్​(సాక్షి రిపోర్టర్), కమలాపూర్ రాజ్ న్యూస్ రిపోర్టర్ తోపాటు పలు మీడియా గ్రూపులు, మీడియా పర్సన్స్  కు ఫార్వార్డ్ చేశాడు. అలాగే ప్రశాంత్ ఈ విషయమై 149 మంది సభ్యులతో మాట్లాడాడు. ఈయన గతంలో హెచ్‌ఎంటీవీ వరంగల్ సిటీ బ్యూరో ఇన్‌చార్జి గా పని చేశాడు. ప్రస్తుతం బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అయిన నమోలో పని చేస్తున్నాడు. అలాగే ఎంపీ బండి సంజయ్ కు సోషల్ మీడియా సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కుట్రపూరితంగా ఎగ్జామ్ హాల్ నుంచి క్వశ్చన్ పేపర్లను సెల్ ఫోన్ల ద్వారా కాపీ చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రశాంత్ గతంలో బండి సంజయ్ తో పలుమార్లు చర్చించారు” అని రిమాండ్​ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 

పరారీలో పలువురు
ఈ కేసు లో నిందితులుగా ఉన్న కమలాపూర్ కు చెందిన A-6 పోగు సుబాష్,  A-7 పోగు శశాంక్, ఇదే మండలం నేరేళ్లకు చెంది A-8 దూలం శ్రీకాంత్,  వంగపల్లికి చెందిన A-9 పెరుమాండ్ల శ్రామిక్, A10 పోతనబోయిన వర్షిత్ చందు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే... శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశముందని మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటలకు కరీంనగర్​ టూటౌన్​లో ఎఫ్ ఐఆర్ ఫైల్ చేశారు. బండి సంజయ్​ ప్రవర్తన మొత్తం టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణపైనే ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నారు.