మున్సిపల్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కుట్ర

మున్సిపల్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కుట్ర

హైదరాబాద్, వెలుగు : రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే మున్సిపోల్స్​షెడ్యూల్ ప్రకటించడం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్ర ఉందని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. టీఆర్ఎస్ కు మేలు చేసేందుకే ఎన్నికల సంఘం హడావుడిగా షెడ్యూల్ ఇచ్చిందని మీటింగ్ లో నేతల మధ్య చర్చ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీ గరికపాటి మోహన్ రావు, బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సీఏఏపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ సాగింది. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను డెవలప్​ చేయడంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం మున్సిపాలిటీలకు గ్రాంట్లు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫండ్స్​ కేటాయించడం లేదన్నారు. కొత్త మున్సిపల్ చట్టం తీసుకువచ్చినా పెద్దగా ఉపయోగం లేదన్నారు. సీఏఏపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై చర్చించినట్లు చెప్పారు. దీనిపై తెలంగాణవ్యాప్తంగా అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.

నేడు ఇందిరా పార్క్ వద్ద సభ

సీఏఏపై అవగాహన సభను సోమవారం ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద జరుపనున్నట్లు రాంచందర్​ రావు చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, ఇచ్చినా, ఇవ్వకపోయినా సభ జరిపి తీరుతామన్నారు. ముఖ్య అతిథిగా నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి శాఖ మంత్రి జితేందర్ సింగ్ వస్తున్నారన్నారు.   రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.