
- ప్రజల వెంట ఉండండి.. వారి సమస్యలపై పోరాడండి
- కష్టపడి పనిచేయండి.. ఈసారి తప్పక గెలుస్తారన్న మోడీ
- రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ ఎంపీ, నేతలు
- కేంద్ర పథకాలను ఇక్కడ అమలు చేయట్లేదని ఫిర్యాదు
- రాష్ట్రంలో అవినీతిపై దర్యాప్తు చేయించాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు:రాష్ట్రంలో వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడేది బీజేపీ సర్కారేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఈసారి పార్టీ క్యాండిడేట్లు పెద్ద సంఖ్యలో గెలుస్తారని, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని తమతో ప్రధాని తన మనసులో మాట పంచుకున్నారని వారు చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజలతో మమేకం కావాలని (జన్ కా సమస్యోంపే లడో.. జన్ కే సాత్ రహో) సూచించినట్లు వివరించారు. మంగళవారం పార్లమెంటులోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మరికొందరు బీజేపీ నేతలు మోడీని కలిశారు.
దాదాపు 15 నిమిషాలకుపైగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులను, సమస్యలను, టీఆర్ఎస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరును మోడీకి వివరించారు. పలు కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలుకావడం లేదని, పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందడం లేదని ఫిర్యాదు చేశారు. వారి విజ్ఞప్తులపై మోడీ సానుకూలంగా స్పందించారు. అయితే తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రధాని మోడీ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.
15 నిమిషాల పాటు భేటీ..
ప్రధాని కార్యాలయంలో భేటీ సందర్భంగా సోయం బాపురావు.. ఆదిలాబాద్, నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ల బీజేపీ క్యాండిడేట్లు పాయల్ శంకర్, రమాదేవిని మోడీకి పరిచయం చేశారు. గత రెండు అసెంబ్లీ ఎలక్షన్లలో వారిద్దరూ గట్టిపోటీ ఇచ్చి.. తక్కువ ఓట్లతో ఓటమి చెందారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘తెలంగాణలో ఈసారి సర్కారు మనదే. ఈసారి అందరూ గెలుస్తారు. సిద్ధంగా ఉండండి. తప్పక గెలుస్తారు. ఇంకో ఆలోచనే అవసరం లేదు. జనం మధ్యలో ఉండండి. జనంతో కలిసి నిలబడండి. వారి సమస్యలపై పోరాడండి. కష్టపడి పని చేయండి. (తెలంగాణమే ఆనేవాలా సర్కార్ హమారీ హీ హై. ఇస్బార్ సబ్జీతేగా. తయార్ రహో. జరూర్ జీతేంగే, కొయీ బాత్ నహీ. లోగోంకా బీచ్మే రహో, అచ్ఛా మెహనత్ కరో. జన్కా సమస్యోంపే లడో.. జన్కే సాత్ రహో..)” అని నేతలకు సూచించారు. నేతలు చేసిన విజ్ఞప్తులన్నింటినీ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో భారీగా అవినీతి..
మోడీతో దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు. దానివల్ల పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందడం లేదన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ప్రధానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కోరారు. ప్రధానిని కలిసిన బృందంలో బాపురావుతోపాటు బీజేపీ కేంద్ర, రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు పాయల్ శంకర్, రమాదేవి, సిర్పూర్ బీజేపీ ఇన్చార్జి శ్రీనివాస్, నేతలు సేడం గణపతి, రామకృష్ణ, వీరమల్లు, సేడం జగ్గు, భూమయ్య తదితరులు ఉన్నారు.
పరిస్థితిని ప్రధానికి చెప్పినం: పాయల్ శంకర్
రాష్ట్రంలో రైల్వే, వైద్య రంగాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర సర్కారు సహకరించడం లేదని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ట్ర రాజధాని నుంచి దూరంగా ఉన్న ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని, 23 ఏళ్ల క్రితం మూతపడ్డ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరామన్నారు. ఆదిలాబాద్– నిర్మల్– ఆర్మూర్ రైల్వే లైన్ ను కేంద్రం మంజూరు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల పనులు సాగడం లేదన్నారు. ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం కేంద్రం వాటాగా రూ. 120 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో 90 శాతం పనులు పూర్తయినా, ప్రారంభానికి నోచుకోవడం లేదని పేర్కొన్నారు.
తప్పక గెలుస్తామన్నరు: రమాదేవి
‘రాష్ట్రంలో తప్పక గెలుస్తారు, ఏం ఫర్వాలేదు (జరూర్ జీతేంగే.. కొయీ బాత్ నహీ)’ అని ప్రధాని మోడీ చెప్పారని నిర్మల్ బీజేపీ అధ్యక్షురాలు పి.రమాదేవి వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని మోడీ, జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధాని దృష్టి సారించారన్నారు. బాసర సరస్వతీ దేవిని దర్శించుకోవాలని మోడీని ఆహ్వానించినట్టు రమాదేవి చెప్పారు. ముధోల్లో టెక్స్ టైల్ పార్క్, ఆదిలాబాద్, నిర్మల్ లలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, బాసర ట్రిపుల్ ఐటీని ఐఐటీగా మార్చాల్సిందిగా కోరామని తెలిపారు.
టార్గెట్ తెలంగాణే!
ప్రధాని మోడీ మాటలను బట్టి చూస్తే బీజేపీ తర్వాతి టార్గెట్ తెలంగాణేనని స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్న తరుణంలో.. రాష్ట్ర నేతలతో ప్రధాని భేటీ, ఆయన మాటలు బలమైన సంకేతాలు ఇస్తున్నాయని అంటున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పరిస్థితులు, తాజా రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని పేర్కొంటున్నాయి. బీజేపీ రాష్ట్ర నేతలు కొంతకాలంగా ఇదే విషయం చెప్తున్నారని స్పష్టం చేస్తున్నాయి.