బాసర ట్రిపుల్ ఐటీని మూసివేసేందుకు కుట్ర: బండి సంజయ్ 

బాసర ట్రిపుల్ ఐటీని మూసివేసేందుకు కుట్ర: బండి సంజయ్ 

టీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన భూముల చిట్టా అంతా తమ దగ్గర ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జా చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీని మూసివేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వేధిస్తున్నారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయలేదని..నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని.. నోటిఫికేషన్లు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వాటాలు పెట్టడానికి కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. 

సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బండి సంజయ్ అన్నారు. పోలీస్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు. కొంతమంది పోలీసులు ప్రమోషన్లు, పదవుల కోసం ముఖ్యమంత్రి చెప్పినట్టు పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ పార్టీకి చెందిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ కు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు బండి సంజయ్ కు హారతులు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు.