రాష్ట్రంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలె

రాష్ట్రంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలె

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఐదు అంశాలపై ఆ పార్టీ తీర్మానాలు చేసింది. మొదటిది రాజకీయ తీర్మానం కాగా, మిగిలిన నాలుగు రైతుల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు కోసం, ధరణి పోర్టల్‌లో లోపాల సవరణ కోసం, ఉద్యోగాల భర్తీ కోసం డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేసింది. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ముఖ చిత్రం మారబోతోందని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు  పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ వ్యాపారం టీఆర్ఎస్ నాయకులకు  ఆదాయంగా  మారిందని, ఇసుక మైనింగ్ టీఆర్ఎస్ మాఫియా చేతుల్లోకి వెళ్లిందని రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపించారు. గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల వ్యాపారం వెనుక ఉన్న శక్తులపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. 

కేసీఆర్ దళిత ద్రోహిగా మారిండు

సీఎం కేసీఆర్ దళిత ద్రోహిగా మారారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. దళిత బంధు నెపంతో ఎస్సీ సబ్ ప్లాన్, కార్పొరేషన్ల నిధులను దారిమళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎస్సీ లను మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేయాలని, వ్యవసాయ ఆదారిత పరిశ్రమలను ప్రోత్సాహించాలని, వర్షానికి తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. రైతుల ప్రత్యామ్నాయ పంటల కోసం సబ్సిడీ పై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించాలని కార్యవర్గం తీర్మానంలో ప్రస్తావించింది. వడ్డీలేని పంట రుణాలు ఇవ్వాలని, ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కోరింది. 

రెవెన్యూ సంస్కరణల పేరుతో తుగ్లక్ నిర్ణయాలు

రెవెన్యూ సంస్కరణల పేరుతో కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని, ధరణి పేరుతో టీఆర్ఎస్ నాయకులు భూ దందాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆరోపించింది. ధరణి లోపాలను అడ్డుపెట్టుకుని అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను టీఆర్ఎస్ అవినీతికి కేంద్రాలుగా మార్చుకుందని పలువురు నేతలు అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబమే ల్యాండ్ కన్వర్షన్ కోసం లంచాలు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి ఇది పరాకాష్ట అని అన్నారు. 

నిరుద్యోగ భృతి బకాయిలు చెల్లించాలె

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని బీజేపీ కార్యవర్గం అభిప్రాయపడింది. వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు ఇన్నాళ్లుగా యువతకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి బకాయిలను కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఉద్యోగ నియామక క్యాలెండర్ విడుదల చేసి, ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.