రైతుల కోసం ఉపవాస దీక్ష

రైతుల కోసం ఉపవాస దీక్ష

ప్రభుత్వం దళారీగా వ్యవహరిస్తోంది

అకాల వర్షాలతో రైతన్నకు ఇబ్బంది

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు మరియు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రోజు ఉపవాస దీక్షలో కూర్చున్నారు. లాక్డౌన్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మొన్నటివరకు పంట కోయడానికి ఇబ్బందిపడ్డ రైతన్న.. ఇప్పుడ పంటను అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కష్టపడి పండించిన పంటను అమ్ముదామని చూస్తే.. వడ్లు బాగా లేవని వ్యవసాయ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. కొన్నిచోట్ల కాంటాలు సరిగా పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల వడ్లు సరిగా లేవని తూకం ఎక్కువ చేసి రైతులను మోసం చేస్తున్నారు. ఇలా రైతులు పడుతున్న బాధలు చూడలేక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరోజు ఉపవాస దీక్షకు దిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్షలో కూర్చొనున్నారు.

అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర బాధలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతులకు సంఘీభావంగా ఈ రోజు ఉపవాస దీక్షకు కూర్చుంటున్నట్లు ఆయన తెలిపారు. ‘రాష్ట్రంలో వడ్లు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై కేబినెట్ లో చర్చించలేదు. ఇతర పార్టీల నాయకులు ఇచ్చిన సూచనలు మరియు సలహాలు పట్టించుకోవడం లేదు. చివరికి విమర్శలను కూడా స్వీకరించడం లేదు. లాక్ డౌన్ పీరియడ్ లో ఐకేపీకి తెచ్చిన ధాన్యం తిరిగి తీసుకెళ్లమనే పరిస్థితి ఏంది? ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల అసలు కొనుగోలే స్టార్ట్ చేయలేదు. ఐకేపీ సెంటర్ లలో రైతలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. రైతులు లాభాలు ఆశించడం లేదు; వారు పెట్టిన పెట్టుబడి వస్తే చాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఏడ్చే పరిస్థితి ఉంది. రైతుల కోసం 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. మరి పంటకు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు? దళారి వ్యవస్థను రూపుమాపుతామని చెప్పిన ప్రభుత్వమే.. దళారిగా వ్యవహరిస్తోంది. రైతు సమన్వయ సమితులు, అధికారులు మిల్లర్లకు కొమ్ము కాస్తూ.. బ్రోకరిజం చేస్తున్నారు. కేటీఆర్ నియోజకవర్గంలో రైతులు తమ పంటని దగ్ధం చేసుకున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపిన రైతులను బెదిరించి కేసులు పెడుతున్నారు. నేను చేస్తున్నది రైతులకు సంఘీభావంగా దీక్ష మాత్రమే కానీ నిరసన కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోకుండా విమర్శలు చేస్తోంది. సీఎం ఎందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం లేదు. అఖిలపక్షం అంటే సీఎంకు భయం ఎందుకు? కొంత మంది సలహాలు విని సీఎం ప్రగతి భవన్ వరకే పరిమితమయి రాష్ట్రాన్ని పాలించాలని అనుకోవడమే ఈ పరిస్థితికి కారణం. రైతులు ఎవరు అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రైతులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

రైతుల కోసం బండి సంజయ్ చేస్తున్న ఈ ఉపవాస దీక్షలో ఆయన వెంట మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, డా. విజయ రామారావు, ఇ. పెద్దిరెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శులు జి. ప్రేమేందర్ రెడ్డి, డా. మనోహర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ శాసన మండలి ఎమ్మెల్సీ రామచందర్ రావు తార్నాకలోని తన నివాసంలో మరియు మంత్రి డీకే అరుణ తన నివాసంలో రైతులకు సంఘీభావంగా ఉపవాస దీక్షలో కూర్చున్నారు.

For More News..

పేదల కోసం రోటీ బ్యాంక్.. 11 రోజుల్లో లక్షకు పైగా చపాతీల పంపిణీ

చెన్నై రోడ్లపై కరోనా ఆటో..

హౌజింగ్ మినిష్టర్ కు కరోనా పాజిటివ్