నేడు(ఆగస్టు 27) ఖమ్మంలో బీజేపీ సభ.. చీఫ్ గెస్టుగా అమిత్ షా

నేడు(ఆగస్టు 27) ఖమ్మంలో బీజేపీ సభ.. చీఫ్ గెస్టుగా అమిత్ షా
  • రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సభ
  • తర్వాత రాష్ట్ర నాయకత్వంతో భేటీ కానున్న షా
  • ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: రైతు గోస.. బీజేపీ భరోసా’ పేరిట ఆదివారం ఖమ్మంలో భారీ సభను బీజేపీ నిర్వ హించనుంది. ఈ మీటింగ్‌‌‌‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌‌‌షా హాజరుకానున్నారు. రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సభను బీజేపీ నిర్వహిస్తోంది. ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్‌‌‌‌లో మధ్యాహ్నం 3:30కు సభ ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి 12.30కు  ప్రత్యేక విమానంలో అమిత్ షా బయల్దేరనున్నారు. 

మధ్యాహ్నం 2.50కి విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఖమ్మం రానున్నారు. సాయం త్రం 5:45 వరకు ఆయన ఖమ్మంలో ఉంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి జన సమీకరణకు పార్టీ నేతలు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్ నేతలు అమిత్‌‌‌‌షా సమక్షంలో బీజేపీలో చేరుతారని నేతలు చెబుతున్నారు. అలాగే, సమావేశం తర్వాత రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో అమిత్‌‌‌‌ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఎలాంటి వ్యూహం అనుసరించాలి? అనే విషయాలను చర్చించనున్నట్టు తెలుస్తోంది.

భద్రాచలం పర్యటన రద్దు

భద్రాచలంలో అమిత్‌‌‌‌షా పర్యటన రద్దు అయిందని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం భద్రాచలం రాముని గుడికి అమిత్ షా వెళ్లాల్సి ఉండగా.. సమయం లేకపోవడం వల్ల ఆలయ సందర్శనను రద్దు చేసుకుంటున్నట్టు శనివారం పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

నేటితో ముగియనున్న ప్రవాసీ ఎమ్మెల్యేల పర్యటన

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన ఆదివారంతో ముగియనుంది. ప్రవాసీ ప్రోగ్రామ్‌‌‌‌లో భాగంగా ఎమ్మెల్యేలు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు, అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, బూత్ స్థాయి కమిటీల పనితీరుపై ఎమ్మెల్యేలు హైకమాండ్‌‌‌‌కు నివేదిక ఇవ్వనున్నారు.