- ఆసిఫాబాద్‌లో 5 డిగ్రీలు.. రాష్ట్రంలో భారీగా పడిపోతున్న రాత్రి, పగలు టెంపరేచర్లు
- మూడు జిల్లాల్లో 6 డిగ్రీలు.. 10 జిల్లాల్లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు
- 26 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదు
- మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న ఐఎండీ
రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ వేవ్ తీవ్రమైంది. నాలుగు జిల్లాలు తప్ప.. మిగతా అన్ని జిల్లాల్లోనూ 5 నుంచి 10 డిగ్రీల మధ్యే టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది.
ఆసిఫాబాద్/హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ వేవ్ తీవ్రమైంది. రెండు మూడ్రోజుల నుంచి చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. బుధవారం రాత్రి 5.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా, 11.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత రికార్డు కావడం గమనార్హం. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు తప్ప.. మిగతా అన్ని జిల్లాల్లోనూ 5 నుంచి 10 డిగ్రీల మధ్యే టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఆ నాలుగు జిల్లాల్లోనూ 11 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాలో కెరమెరి మండలంలో 5.7 డిగ్రీలు, తిర్యాణి మండల కేంద్రంలో 5.8 డిగ్రీల ఉష్టోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 6.1 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.4, సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలో 6.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పది జిల్లాల్లో 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రత రికార్డయింది.
సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా ధరూరులో 7.1, నిర్మల్ జిల్లా పెంబిలో 7.2, నారాయణపేట జిల్లాలో 7.3, కామారెడ్డి జిల్లా గాంధారిలో 7.3, నిజామాబాద్ జిల్లా గోపనపల్లి, జగిత్యాల జిల్లా గుళ్లకోట, మెదక్ జిల్లా దామరంచల్లో 7.5 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా మానాల్‌లో 7.7, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 7.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మరో 8 జిల్లాల్లో 8 డిగ్రీలు, నాలుగు జిల్లాల్లో 9 డిగ్రీలు, మూడు జిల్లాల్లో 10 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్స్ నమోదయ్యాయి. మొత్తంగా 26 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో మూడు నాలుగు రోజుల పాటు చలి తీవ్రత ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్‌లోనూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉంటోంది. బుధవారం పఠాన్ చెరువులో కనిష్టంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు తక్కువ.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 8 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 8.3, మౌలాలిలో 8.8, రాజేంద్రనగర్‌లో 9.5, హయత్ నగర్‌లో 10, గచ్చిబౌలిలో 10.6, కుత్బుల్లాపూర్‌లో 10.7, శివరాంపల్లిలో 10.8, బేగంపేట్‌లో 13.2, హకీంపేట్‌లో 16.1 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మరోవైపు, ఉష్టోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకే ఇండ్లకు చేరుకుంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పల్లెల్లో చలి నుంచి రక్షణ కోసం నెగడి వేసుకుని ప్రజలు గుంపులుగా కూర్చుంటున్నారు.

