- ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద జీవిత బీమా పథకం
- పేద, ధనిక తేడా లేకుండా అన్ని కుటుంబాలకు రూ.5 లక్షల కవరేజీ
- జూన్ 2, 2026 నుంచి అమలు.. బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయింపులు
- కుటుంబ పెద్దను కోల్పోయిన వేళ.. అండగా నిలిచే సర్కార్ భరోసా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పూర్తి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’ ప్రకటించింది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైతే, ఆ కుటుంబం ఎదుర్కొనే మానసిక వేదన ఒకటైతే, ఆర్థికంగా కుప్పకూలి రోడ్డున పడటం మరో విపత్తు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ ఒక్క తెలంగాణ బిడ్డ అభద్రతాభావానికి గురికాకూడదని, ప్రపంచంలోని ఏ దేశానికీ సాధ్యం కాని రీతిలో ఈ మహాత్తర పథకానికి బడ్జెట్‌లో అంకురార్పణ చేసింది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఎలాంటి సామాజిక లేదా ఆర్థిక వివక్ష ఉండదు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడాలు చూడకుండా రాష్ట్రంలోని సుమారు 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ బీమా రక్షణ కల్పించనున్నారు. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమాను అందిస్తూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2, 2026 నుంచి ఈ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టబోతున్నారు.
ప్రభుత్వం దీనిని ఒక ‘యూనివర్సల్ ఇన్సూరెన్స్’ నమూనాలో తీర్చిదిద్దుతోంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని ఒక యూనిట్‌గా తీసుకుని, ఆ కుటుంబానికి బీమా కవచం ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ప్రైవేట్ బీమా తీసుకోవాలంటే ఏటా వేల రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ 1.15 కోట్ల కుటుంబాల తరఫున అయ్యే భారీ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.
దీనివల్ల సామాన్యులపై పైసా భారం పడదు. కుటుంబ యజమాని లేదా ఆదాయం తెచ్చే వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ రూ.5 లక్షల బీమా సొమ్ము తక్షణమే అండగా నిలుస్తుంది. రైతు బీమా మాదిరిగానే ఈ స్కీమ్‌ను అమలు చేయనుంది. కుటుంబంలో ఆదాయం తీసుకువచ్చే పర్సన్ చనిపోతే వారం, పదిరోజుల్లోనే రూ.5 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకోనున్నారు.
అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కూడా ఇన్ని కోట్ల మందికి ఒకేసారి ప్రభుత్వమే ప్రీమియం కట్టి ఉచిత జీవిత బీమా కల్పించడం అరుదైన విషయంగా ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. జూన్ 2026 నాటికి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డిజిటల్ డేటా , ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందాలను ప్రభుత్వం పూర్తి చేయనుంది.
