నేడు తాత్కాలిక బడ్జెట్

నేడు తాత్కాలిక బడ్జెట్

అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలకు  అంతా సిద్ధమైంది.  ఇవాళ ఉదయం  11.30 కు  సెషన్ మొదలు కానుంది.  అసెంబ్లీలో  ముఖ్యమంత్రి కేసీఆర్,  శాసనమండలిలో  ఆరోగ్యశాఖ మంత్రి  ఈటల రాజేందర్   ఓటాన్ అకౌంట్  బడ్జెట్  ప్రవేశపెట్టనున్నారు.  సమావేశాల్లో కొత్త మంత్రులు  ప్రత్యేక  ఆకర్షణగా  నిలవనున్నారు. వచ్చే 6 నెలల కాలానికి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు ఎక్కువ ప్రాథాన్యత ఇచ్చినట్టు సమాచారం. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, ప్రజారోగ్యం, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతో పాటు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తారని తెలుస్తుంది. ఈసారి అసెంబ్లీలో సీఎం కేసీఆరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం చదువుతారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో  KCR ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటి సారి. అయితే ఆర్థికశాఖ సీఎం దగ్గరే ఉండడంతో…. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రిపేర్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో  1991 లో ముఖ్యమంత్రి హోదాలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి. ఆ తర్వాత  2010-2011  జనరల్  బడ్జెట్ ను ముఖ్యమంత్రిగా ఉండి, తన దగ్గరే ఆర్థికశాఖ ఉండటంతో అప్పటి సీఎం రోషయ్య బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కొత్తగా పదవులు చేపట్టిన 10 మంది మంత్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్రబెల్లి  దయాకర్ రావు తొలిసారిగా మంత్రిగా సభలో అడుగు పెట్టనున్నారు. రెండు సార్లు గెలిచిన  శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డిలు మంత్రులుగా మొదటి సారి సభకు రానున్నారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి మంత్రుల హోదాలో సభకు హాజరు కాబోతున్నారు. గత ప్రభుత్వంలో శాసససభా వ్యవహారాల మంత్రిగా వ్యవహరించిన  హరీష్ రావు ప్లేసులో ఈసారి వేములు ప్రశాంత్ రెడ్డి ఉండనున్నారు. గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో సభకు వచ్చిన కేటీఆర్ ఎమ్మెల్యేగా సభకు వస్తున్నారు.

ఈ సెషన్లోనే డిప్యూటి  స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుందని తెలుస్తుంది. మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకుంటారని సమాచారం. మొదటి రోజు ఓటాన్ అకౌంట్  బడ్జెట్  ప్రవేశ పెట్టిన తర్వాత…. బిజినెస్ అడ్వజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎజెండా ఖరారు కానుంది. రెండో రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక , ఓటాన్ అకౌంట్ బడ్టెట్ పై చర్చను ప్రారంభించి…..అటవీ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది అధికారపక్షం. మూడో రోజు ఆదివారం అసెంబ్లీ , మండలికి సెలవు. తిరిగి సోమవారం పూర్తి స్థాయిలో  బడ్జెట్ పై చర్చించి, ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదించనుంది అసెంబ్లీ , శాసన మండలి.