- ఇయ్యాల సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి
- వ్యవసాయం, విద్యకు అధిక ప్రాధాన్యం
- పంచాయతీలు, ఇరిగేషన్‌కు పెరగనున్న నిధులు
- ఆరు గ్యారంటీలకు ఢోకా లేకుండా ఫండ్స్
- అంకెల గారడీకి పోకుండా వాస్తవాలకు తగ్గట్టు పద్దు
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ, ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయ్యింది. ఇప్పటికే 4 నెలలపాటు ఆదాయ, ఖర్చులపై స్పష్టమైన అవగాహన ఉన్న సర్కారు.. వాస్తవ పద్దునే పెట్టేందుకు సిద్ధమైంది. రూ.2.93 లక్షల కోట్ల నుంచి రూ.2.95 లక్షల కోట్ల వరకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి పద్దును పెడుతున్నది. ఈ మేరకు బడ్జెట్‌కు గురువారం ఉద యం 9 గంటల ప్రాంతంలో అసెంబ్లీ లాబీల్లోని కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆమోదం తెలుపను న్నది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం ఆశించినా.. అలాంటివేమి ప్రకటించలేదు. దీంతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ఇన్ఎయిడ్ను ఈ బడ్జెట్లో కొంతమేర తగ్గించుకోనున్నది. అదే సమయంలో రాష్ట్ర సొంత ఆదాయం ఎక్కువ గా చూపనున్నది.
వివిధ మార్గాల్లో వస్తున్న రాబడిని పెం చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం, గతంలో ఉన్న లూప్స్‌ను అరికట్టడంతో ఆదాయం పెరిగింది. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూను కూడా ఎక్కువగా అంచనా వేస్తున్నారు. ఇందుకు టీజీఐఐసీ భూములు తనఖా పెట్టి, వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం లోన్లు తీసుకోనున్నది. అస లు రాష్ట్ర సొంత ఆదాయం ఎంత? కేంద్రం నుంచి వస్తున్నది ఎంత? ఇతర ఆదాయ మార్గాలు ఏమున్నాయి? అప్పుల ద్వారా ఎంత సమకూరుతుంది? అనే వివరాలతో పాటు ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చవుతుంది? ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయింపులతో పాటు రుణమాఫీకి, రైతు భరోసా నిధుల సర్దుబాటు వంటి వాటిపై సర్కార్ బడ్జెట్లో పూర్తి స్పష్టత ఇవ్వనున్నది.
అగ్రికల్చర్, ఎడ్యుకేషన్‌కు హై ప్రయారిటీ
అగ్రికల్చర్, విద్యకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెరుగనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖకు పెద్దఎత్తు న కేటాయింపులు చేయనున్నారు. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.14 వేల కోట్లు, రైతుబీమా, పంటల బీమా, విత్తన సబ్సిడీకి పెద్ద ఎత్తున పద్దు పెట్టనున్నది. ఎడ్యుకేషన్‌కు కూడా మంచి కేటాయింపులు ఉంటాయని తెలుస్తున్నది. ఇరిగేషన్‌కు రూ.25 వేల కోట్లపైనే కేటాయించనున్నది. మూసీ రివర్‌ఫ్రంట్‌కు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్టు సమాచారం.
సొంత రాబడి పెంపుపై కసరత్తు
కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనుకు న్నంత రావడం లేదు. గత ప్రభుత్వం 2023–24లో రూ.43,294 కోట్లు వస్తుందని పేర్కొన్నది. కానీ, అది రూ.10 వేల కోట్లే వచ్చింది. కాంగ్రెస్ సర్కారు 2024–25 ఓటాన్ అకౌంట్లో రూ.21 వేల కోట్లు ప్రతిపాదించింది. ఇప్పుడు కూడా కొంత అటు ఇటుగా అంతే ప్రతిపాదించనున్నారు. ఇక నాన్ ట్యా క్స్ రెవెన్యూ విషయంలోనూ ప్రభుత్వం అదనపు ఆదా యాలను దృష్టిలో పెట్టుకుని, ముందుకు వెళ్లనున్నది. జీత భత్యాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీలకు అవ సరమైన మేరకు కేటాయింపులు చేయనున్నారు.
జీఎ స్డీపీలో 3 శాతం అప్పుల రూపంలో సమకూరుతాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ రూ.1.70 లక్షల కోట్లకుపైన వస్తుందని అంచనా వేస్తున్నారు. నాన్‌ట్యాక్స్ రెవెన్యూ రూ.25వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్రతిపాదన లు చేశారు. రూ.60 వేల కోట్ల వరకు అప్పులు తీసుకోను న్నారు. ఇతరత్రా అన్నీ కలిపితే బడ్జెట్ రూ.2.95 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నది.
పదేండ్ల కాలంలో గత బీఆర్ఎస్ సర్కారు బడ్జెట్‌ను వాస్తవానికి10 శాతం నుంచి 12 శాతం వరకు పెంచుతూ వచ్చింది. అయితే, ఈ సారి అంకెలు మార్చి గారడీ చేయకుండా.. ఎంత వస్తుందో అంతే పెట్టుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి లో పెట్టిన 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం 2.76 లక్షల కోట్ల పద్దు చూపింది.