కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై నేడు( మే 26) తుది నిర్ణయం

కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై నేడు( మే 26)  తుది నిర్ణయం
  • నేతలతో చర్చించి ఫైనల్ చేయనున్న రాహుల్..  మే 27న ప్రకటన? 
  •  ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ 
  • నేడు ( మే 26) మళ్లీ భేటీ.. అనంతరం రాహుల్ తో మీటింగ్ 
  • రేపు( మే27)  ఖర్గే అనుమతితో ప్రకటన! 
  • మంత్రివర్గంలో కొత్తగా ఐదు బెర్త్​ లు  భర్తీ చేసే చాన్స్ 
  • నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పీసీసీ కార్యవర్గం 
  • మీనాక్షి నటరాజన్ కు ఢిల్లీ నుంచి పిలుపు 


న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై మంగళవారం ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో సోమవారం ఫైనల్ నిర్ణయం జరగనుంది. ఆదివారం ఢిల్లీలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్చుపై చర్చించారు. రాత్రి 7.40గంటలకు సమావేశం ప్రారంభం కాగా 8.40 గంటలవరకు కొనసాగింది.

కేబినెట్లో కొత్తగా ఐదు బెర్తుల ఖరారుపై నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. సామాజిక సమతుల్యత ఉండేలా ఆయా వర్గాల పేర్లకు కేసీ వేణుగోపాల్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతోపాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి తుది లిస్టు ఆయన రికార్డు చేసుకున్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఇప్పుడున్న కేబినెట్ లో ఓసీ వర్గం నుంచి ఒకరిని డ్రాప్ చేయాలని, ఆ ప్లేస్​ లో  మరో ఓసీకి చాన్స్ ఇవ్వాలని, అదేవిధంగా కొత్తగా మరో ఓసీ (రెడ్డి) కి అవకాశం కల్పించాలనే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. 

పీసీసీ నూతన కార్యవ ర్గంపైనా ఇందులో చర్చించారు. అయితే.. ఈసారి పరిమితంగా కార్యవర్గ కూర్పు చేపట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నదని కేసీ వేణుగోపాల్ అన్నట్లు తెలిసింది. సామాజిక సమీకరణాల ఆధారంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు చోటు కల్పించ నున్నట్లు సమాచారం. 

ఖర్గే అనుమతితో రేపు ప్రకటన! 

విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న కేసీ వేణుగోపాల్.. సీఎం రేవంత్​ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్​ తో  సమావేశమయ్యారు. లోథి రోడ్ లోని వేణుగోపాల్ ఇంట్లో ఈ భేటీ జరిగింది. గతంలో పరిగణనలోకి తీసుకున్న పేర్లతో పాటు, పార్టీనేతల నుంచి వస్తున్న పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. సోమవారం మరోసారి భేటీ కావాలని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్లు సమాచారం. అనంతరం ఫైనల్ లిస్ట్ ను రూపొందించే దిశలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో సమావేశం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. 

అందువల్ల హైదరాబాద్​ కు  తిరిగి వెళ్లడాన్ని వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం. అలాగే పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ను సోమవారం జరిగే భేటీకి రావాలని సమాచారం అందించారు. ప్రకృతి చికిత్సలో ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ర్జున ఖర్గే మంగళవారం ఢిల్లీకి రానున్నారు. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఫైనల్ లిస్ట్ తయారైనా..పార్టీ అధ్యక్షుడి అనుమతితో మంగళ వారం ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారని చెప్తున్నాయి.

కవిత లేఖపై ఆరా 

సుమారు గంటపాటు సాగిన భేటీలో పార్టీ అంత ర్గత అంశాలతో పాటు కేసీఆర్ కు కవిత రాసిన లేఖపై కేసీ వేణుగోపాల్ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ లేఖ వెనుక అసలు రాజకీయ కోణం. బీఆర్ఎ స్ లో మారిన పరిణామాలు. ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. "అసలు కవిత ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది. తండ్రిని కలవలేని పరిస్థితి కూతురుకు ఎందుకు వచ్చింది? ఆమె చెప్పే దయ్యాలు ఎవరు?" అన్న అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.