ఇవాళ(అక్టోబర్1) తెలంగాణ కేబినెట్ సమావేశం

ఇవాళ(అక్టోబర్1) తెలంగాణ కేబినెట్ సమావేశం
  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, రాజీవ్ యువ వికాసంపై కీలక నిర్ణయాలు? 
  • ఉద్యోగులకు రెండు డీఏల చెల్లింపునకు ఆమోదం
  • పాలిటెక్నిక్​లు, ఆర్ఆర్ఆర్, మెట్రో ప్రాజెక్టుపై చర్చ

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏల మంజూరుతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్  నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు మొదటి డీఏ 3.64 శాతం, రెండో డీఏ 2.74 శాతం మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. డిసెంబర్​లో జరగనున్న గ్లోబల్  సమిట్  నిర్వహణపై కేబినెట్  చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. కుటుంబ యజమాని మరణిస్తే రూ.5 లక్షల బీమా ఇచ్చే ఈ పథకాన్ని వచ్చే నెల 19న ఇందిరాగాంధీ జయంతి రోజున ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాలిటెక్నిక్​లను స్కిల్ ​యూనివర్సిటీలో విలీనానికి సంబంధించి కేశవరావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

నిషేధిత భూముల జాబితా నుంచి ఊరట కలిగించే అంశాలు, కొత్త చేయూత పెన్షన్లు, రాజీవ్  యువ వికాసం, హైదరాబాద్‌‌‌‌  మెట్రో, మూసీ ప్రాజెక్టు, ఆర్ఆర్ఆర్, ఇందిరమ్మ చీరల పంపిణీపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, అంచనాల సవరణపై కేబినెట్ 
సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

పీఆర్సీ నివేదికపై కేబినెట్​లో చర్చ?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) నివేదికపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. పీఆర్సీ కమిటీకి ఇచ్చిన తుది గడువు సెప్టెంబర్ 30తో ముగియడంతో ఈసారి గడువు పెంపు ఉండదని.. కమిషన్  సమర్పించే సమగ్ర నివేదికను ప్రభుత్వం స్వీకరించనున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నివేదికలోని అంశాలను పరిశీలించి త్వరలో రెండో పీఆర్సీ ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌పై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసేందుకు 
సన్నాహాలు చేస్తోంది.