ఇప్పట్లో టీఆర్టీ లేనట్టే!

ఇప్పట్లో  టీఆర్టీ లేనట్టే!

మళ్లీ టెట్ నిర్వహించాలని
కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్​లో నిర్ణయం 

  • స్టూడెంట్స్​ లేనప్పుడు కొత్త టీచర్లు అవసరం లేదని చర్చ 
  • మంత్రి కేటీఆర్ రాకపోవడంతో మధ్యలోనే మీటింగ్ వాయిదా 

హైదరాబాద్,  వెలుగు : రాష్ట్రంలో త్వరలో మళ్లీ టీచర్​ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. శుక్రవారం ఎంసీఆర్ హెచ్​ఆర్డీలో ​మంత్రి​సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు హరీశ్​​రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరయ్యారు. టెట్, టీఆర్టీ (టీచర్​ రిక్రూట్​మెంట్​ టెస్ట్) తదితర అంశాలపై చర్చించారు. టెట్ నిర్వహించి ఏడాది కావడంతో, నిబంధనల ప్రకారం మరోసారి పెట్టాలని మీటింగ్​లో నిర్ణయించారు. మరో వారం, పదిరోజుల్లో టెట్​ షెడ్యూల్ రిలీజ్ చేసే చాన్స్​ఉందని అధికారులు చెప్తున్నారు.

టీఆర్టీపై స్పష్టత కరువు 

టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) పై కేబినెట్ సబ్ కమిటీలో స్పష్టత రాలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కేవలం ఒకేసారి (2017లో) మాత్రమే టీఆర్టీ నిర్వహించి 8,792 పోస్టులు భర్తీ చేశారు.  ఆ తర్వాత మళ్లీ టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. 

ఈసారి టెట్​తో పాటు టీఆర్టీ పెట్టాలనే ప్రపోజల్ వచ్చినట్టు తెలిసింది. అయితే, ‘ప్రస్తుతం బడుల్లో పిల్లలు తగ్గిపోతున్నారు. పిల్లలే లేనప్పుడు టీఆర్టీ ఎందుకు?’ అని విద్యాశాఖ అధికారులను ఓ కీలక మంత్రి ప్రశ్నించినట్టు సమాచారం. స్టూడెంట్, టీచర్ రేషియో వివరాల ప్రకారం టీచర్లు ఎక్కువగానే ఉన్నారని మంత్రులు చెప్పినట్టు తెలిసింది. కాగా, హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు అవసరమని, వారికోసమైనా టీఆర్టీ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ముందు టెట్ నిర్వహించి, ఆ తర్వాత అవకాశం ఉంటే, పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేయొచ్చని మంత్రులు చెప్పినట్టు తెలిసింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మనబస్తీ మనబడిపై మంత్రి అసహనం 

సర్కారు స్కూళ్లలో జరుగుతున్న మనఊరు మనబడి పనులపై సబ్ కమిటీ చర్చించింది. మొదటి విడుతలో జరుగుతున్న పనులపై అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అయితే, పనులను స్పీడప్ చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. కాగా, హైదరాబాద్ జిల్లాలో జరుగుతున్న పనుల తీరుపై నగరానికి చెందిన ఓ మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మనబస్తీ మనబడి కార్యక్రమం సరిగా జరగడం లేదని, పర్యవేక్షణ కూడా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సిటీపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. 

సబ్ కమిటీ మీటింగ్ గంటన్నరే..

చాలా నెలల తర్వాత ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా టీఆర్టీ, ప్రైవేటు బడుల్లో ఫీజుల నియంత్రణ, కాలేజీల్లో మిడ్డే మీల్స్, వర్సిటీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై చర్చ జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ, కేవలం ఒకటీ, రెండు అంశాలపై నామమాత్రంగానే చర్చ జరగడంపై అందరిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన మీటింగ్..​12గంటల లోపే ముగిసింది. మంత్రి కేటీఆర్​రాకపోవడంతో హడావుడిగా మధ్యలోనే సమావేశాన్ని ముగించినట్టు తెలుస్తోంది. 

ఆశ వర్కర్ల సమావేశం ఉండటంతో మంత్రి హరీశ్​ వెళ్లిపోయారు. ఆయన బాటలోనే మిగిలిన మంత్రులూ వెళ్లిపోయారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన మీటింగ్​ మధ్యంతరంగా ముగియడంతో ఆ శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదన చెందినట్టు తెలిసింది. అలాగే, కేబినెట్ సబ్ కమిటీ సమావేశంపై మీడియాకు కూడా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.