- విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నోళ్లు అధికారులకు వివరాలివ్వొచ్చు
- ముదిరాజ్‌లను బీసీ (ఏ)లో చేర్చే అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం
- మంత్రులు వాకిటి, పొన్నం గంగపుత్రులతో చర్చించి అపోహలు దూరం చేయాలి
- ట్యాంక్ బండ్‌పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్
- ముదిరాజ్‌లు ఐక్యంగా హక్కులు సాధించుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: కులగణనలో నమోదు చేసుకోనివారు ఇప్పటికైనా అధికారులకు వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన ముదిరాజ్ వీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘కులగణన లెక్కల్లో లోపాలున్నాయని కొందరు అంటున్నారు. సహకరించకుండా విమర్శలు చేయడం సరికాదు. ఇంకా నమోదు చేసుకోనివారు ఎవరైనా ఉంటే అధికారుల వద్ద నమోదు చేసుకోండి. హడావుడిగా కులగణన చేయొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాను’’ అని చెప్పారు.
జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రకటించారని సీఎం గుర్తుచేశారు. అందులో భాగంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి మధ్య ఏడాది వ్యవధిలో కులగణన పూర్తి చేసిందని, అయితే కొందరు అందులో పాల్గొనలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని, 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను తమ ప్రజాప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ సందర్భంగా పండుగ సాయన్నపై రూపొందించిన పాటను సీఎం విడుదల చేశారు. ఆ పాటను ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ ఆలపించారు.
ముదిరాజ్‌లను బీసీ(ఏ)లోకి చేర్చడంపై కేబినెట్లో చర్చిస్తం
ముదిరాజ్‌లను బీసీ (డీ) నుంచి బీసీ(ఏ) లో చేర్చే అంశాన్ని కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో మాట్లాడి ముందుకెళ్తామన్నారు. ‘ముదిరాజ్ కమ్యూనిటీని బీసీ -డీ గ్రూపు నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చే ప్రతిపాదనలను సరైన లెక్కలు లేవన్న కారణంగా నాడు కోర్టులు తిరస్కరించాయి.. కానీ మా ప్రభుత్వం నిర్వహించిన కులగణనతో ఇప్పుడు బీసీల లెక్కలు పక్కాగా తేలాయి. అందువల్ల ఈ విషయంలో సముచిత నిర్ణయం తీసుకుంటాం’ అని హామీ ఇచ్చారు.
ముదిరాజ్‌లను బీసీ -ఏ గ్రూపులో చేర్చడం ద్వారా గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందన్న అనుమానాలు, అపోహలు ఉన్నాయని సీఎం రేవంత్ పెర్కొన్నారు. అందువల్ల గంగపుత్రులతో చర్చించి, వారిలోని అపోహలను దూరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘గంగపుత్రులు మంచోళ్లు.. వాళ్లకు నష్టం జరగకుండా ముదిరాజ్‌లకు న్యాయం చేయాల్సిన బాధ్యతను మంత్రులు శ్రీహరి, పొన్నం ప్రభాకర్ తీసుకోవాలి. మీరిద్దరూ గంగపుత్ర కుల సంఘం పెద్దలతో మాట్లాడండి.’ అని సూచించారు. ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న , దొడ్డి కొమరయ్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. “ పండుగ సాయన్న, గద్దర్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, అందె శ్రీ.. వీళ్లు నాకు బంధువులు కాదు. వీరంతా మన ప్రజల కోసం, మన ప్రాంతం కోసం వాళ్ల జీవితాలను త్యాగం చేసిన వాళ్లు” అని పేర్కొన్నారు. 2009 లో కొడంగల్ లో తనను తొలిసారి గెలిపించింది ముదిరాజ్ లే అని సీఎం గుర్తు చేశారు.
ముదిరాజ్ లకు ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ని ప్రధానిని చేసేందుకు వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమని, మీరంతా అండగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. “నమ్మకం, పౌరుషం ఉన్న జాతి ముదిరాజ్. ఏ పరీక్షనైనా తట్టుకొని గెలుస్తారు. కానీ వారి గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు అని శ్రీహరి నాకు చెప్పారు. నల్గొండ గద్దర్ పాట లో సాయన్న గొప్పతనాన్ని చాటి చెప్పారు. భూ ఆక్రమణలపై సాయన్న పోరాడారు. నిరుపేదలు, బహుజనులకు అండగా వారి భూములను రక్షించేందుకు జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాముల ఎదురుతిరిగాడు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి పండుగ సాయన్న కథను జానపదాల రూపంలో పల్లెల్లో ఇప్పటికీ గానం చేస్తారు..’ అని సీఎం గుర్తుచేశారు. అలాంటి సాయన్నకు చరిత్ర లో ఒక పేజీ ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు.
ముదిరాజ్‌లకు న్యాయం జరగాలి: పొన్నం
బీసీ-ఏలో ఇప్పటికే ఉన్న నాయి బ్రాహ్మణులు గంగపుత్రులు తదితర కులాలకు ఎలాంటి నష్టం కలగకుండా ముదిరాజ్‌లకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీ ప్రజాప్రతినిధులుగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, ఎవరి అవకాశాలూ దెబ్బతినకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ డీ నుంచి బీసీ ఏ లకు ముదిరాజ్ లను చేర్చాలని, అదే సమయంలో బీసీ ఏ లో ఉన్న కులాలకు అన్యాయం చేయెద్దని కాంగ్రెస్ నేత నీలం మధు సూచించారు. ఈ అంశంపై సీఎం నుంచి సానుకూలంగా స్పందన వస్తుందని ముదిరాజ్ సమాజం భావిస్తోందన్నారు. శాసన మండలి స్పీకర్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. వై ఎస్ ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముదిరాజ్ లను బీసీ డి నుంచి బీసీ ఏ లో చేర్చారని, ఆ జీవో ను అమలు చేయాలని కోరారు. హైదరాబాద్ లో ముదిరాజ్ భవన్ కు 5 ఎకరాల స్థలం ఇచ్చారని, అక్కడ భవనాన్ని నిర్మించేందుకు నిధులు ఇవ్వాలని, అన్ని జిల్లా లో ముదిరాజ్ భవన్ లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ ఇవ్వాలి
సీఎం మాట్లాడుతున్న సమయంలో ముదిరాజ్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని సభ లో నినాదాలు చేశారు. దీంతో ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీతో పాటు భవిష్యత్ లో అన్ని పదవులు వస్తాయని సీఎం ప్రకటించారు. ‘ఈ అంశంపై మాట్లాడేందుకు ఇపుడు పీసీసీ చీఫ్ సభలో లేరు.. ఆయనతో మాట్లాడాలని మంత్రి పొన్నంను కోరుతున్నాను.. నాకు వయసు అయి పోలేదు.. ఫామ్‌హౌస్ లో ఉండే వ్యక్తి ని కాదు .. మైసూర్ నుంచి కొడంగల్ వెళ్దాం అనుకున్నా.. కానీ సాయన్న జయంతి కి రావాలని శ్రీహరి అడిగారు.. ఆయన అడగ్గానే వచ్చాను.. మీకు అన్నివిధాలా న్యాయం చేస్తాను..’ అని సీఎం రేవంత్ స్పష్టంచేశారు.
పదేండ్లు పండుగ సాయన్నను గుర్తించలేదు: మంత్రి వివేక్
ముదిరాజ్ ల ఆరాధ్య ధైవమైన పండుగ సాయన్నను పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ లకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చారని, నీలం మధుకు మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ర్టంలో ఎక్కువ జనాభా ఉన్న బీసీల్లో ముదిరాజ్ లు ఐక్యంగా ఉండాలని, మిమ్మల్ని విడదీయాలని చాలా మంది కుట్రలు చేస్తుంటారని హెచ్చరించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలోని 16 సీట్లకు గాను ముగ్గురు ముదిరాజ్ లకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నట్టు చెప్పారు. నియోజకవర్గం లో ముదిరాజ్ భవన్ కు రూ. 50 లక్షలు విరాళం ఇచ్చామని తెలిపారు.
పాలమూరు జిల్లాకు సాయన్న పేరు పెట్టాలి: మంత్రి వాకిటి
ముదిరాజ్ లు అంతా ఏకం కావాలని మన రాత మారాలంటే ప్రతి ముదిరాజ్ బిడ్డ మంచి చదువులతో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చాలని, ఇది 60 ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్ అన్నారు. పాలమూరు యూనివర్సిటీకి గానీ, పాలమూరు జిల్లాకు గానీ పండుగ సాయన్న పేరు పెట్టాలని కోరారు.
