తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను (ఆగస్టు 21న) విడుదల చేశారు. ఇందులో 7 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వారి స్థానాల్లో ఇతరులకు కేటాయించారు. నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. వాటిలో నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ ఉన్నాయి. ఈ నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రస్తుతానికి వెల్లడించలేదు. మెట్‌పల్లి, ఉప్పల్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేములవాడ సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు.
ఏడు స్థానాల్లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్తవారికి టికెట్లు ఇవ్వడానికి బీఆర్ఎస్ వ్యూహాలు చాలానే ఉన్నాయి. కేసీఆర్ చేయించిన సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండడం కూడా ఒక కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తరచూ వివాదాల్లో ఇరుక్కోవడం, అంతగా యాక్టివ్ గా లేకపోవడం, ప్రజల్లో మమేకమై లేకపోవడం, నాయకులను కలుపుకొని పోలేకపోవడం.. ఇలాంటి కారణాలతో సిట్టింగులకు టికెట్లు ఇవ్వలేదని తెలుస్తోంది.
* కోరుట్ల : కోరుట్ల ఎమ్మెల్యేగా ప్రస్తుతం విద్యాసాగర్ రావు ఉన్నారు. అనారోగ్యం కారణాల కారణంగా ఈసారి ఈయనకు టికెట్ కేటాయించకుండా విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ సంజయ్ కు కేటాయించారు.
* వేములవాడ : వేములవాడ ఎమ్మెల్యేగా ప్రస్తుతం చెన్నమనేని రమేష్ ఉన్నారు. ఈయనకు జర్మనీ పౌరసత్వం ఉండడం వల్ల పార్టీకి సమస్యలు ఎదురవుతున్నాయి. అందువల్ల ఈసారి రమేష్ కు టికెట్ కేటాయించలేదు. ఆయన స్థానంలో చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్ ఖరారు చేశారు.
* ఖానాపూర్ : ఖానాపూర్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం రేఖా నాయక్ ఉన్నారు. రెండుసార్లు టికెట్ ఇచ్చిన కేసీఆర్ ఈసారి మాత్రం రేఖానాయక్ కు ఇవ్వలేదు. ఆమె స్థానంలో భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఎస్టీ) కేటాయించారు. ఈయన మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు.
* ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆత్రం సక్కు ఉన్నారు. ఈయనకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి కోవా లక్ష్మీ (ఎస్టీ)కి కేటాయించారు.
* ఉప్పల్ : ఉప్పల్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం బేతి సుభాష్ రెడ్డి ఉన్నారు. ఈయనకు టికెట్ ఇవ్వలేదు. బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఖరారు చేశారు.
* స్టేషన్ ఘనపూర్ : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం తాటికొండ రాజయ్య ఉన్నారు. ఈయనకు టికెట్ కేటాయించలేదు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు.
* వైరా : వైరా ఎమ్మెల్యేగా ప్రస్తుతం రాములు నాయక్ ఉన్నారు. ఈయనకు టికెట్ కేటాయించలేదు. బానోతు మదన్ లాల్ (ఎస్టీ) కు టికెట్ కేటాయించారు.
* బోథ్ : బోథ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం రాథోడ్ బాపూరావు ఉన్నారు. ఈయనకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి అనిల్ జాదవ్ (ఎస్టీ)కు కేటాయించారు. ఈయన కూడా మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడని చెబుతుంటారు.