- సైబర్ క్రైం పోలీసుల కేసు ఆధారంగా సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసు దర్యాప్తులో తెలంగాణ సీఐడీ ఎంటరైంది. ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లకు 4 బెట్టింగ్ యాప్‌లతో సంబంధాలు ఉన్నాయని, ఆ బెట్టింగ్ యాప్‌లను ఇమ్మడి రవి ప్రమోట్ చేశాడన్న ఆరోపణలపై సీఐడీ సిట్ దర్యాప్తు ప్రారంభించింది.
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల వద్ద ఉన్న ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ సహా నిందితుడు ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాలను కూడా సిట్ సేకరించింది. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై సీఐడీ సిట్ అధికారులు ఇప్పటికే విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్ సహా ఇతర నటులు, యాంకర్లు తదితరులను సిట్ అధికారులు విచారిస్తున్నారు.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కూడా నాలుగు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రవిని కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఐబొమ్మ, బప్పం సైట్లతో లింక్ చేసిన యాప్స్‌ను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
ఆయా యాప్ లపై ఎక్కడైనా కేసులు నమోదు అయ్యాయా, యువకులెవరైనా ఆత్మహత్యలు కానీ ఆత్మహత్య యత్నాలకు పాల్పడ్డారా అనే వివరాలు సేకరించనున్నామని ఓ అధికారి తెలిపారు. కాగా, రవి ప్రస్తుతం సైబర్ క్రైం పోలీసుల కస్టడీలో ఉన్నందున కస్టడీ ముగిసిన అనంతరం.. ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.
