యాదాద్రి జిల్లాలో కొన్న ధరకే వడ్ల విక్రయం!..సివిల్ సప్లయ్ సంచలన నిర్ణయం

యాదాద్రి జిల్లాలో కొన్న ధరకే వడ్ల విక్రయం!..సివిల్ సప్లయ్ సంచలన నిర్ణయం
  • గోడౌన్ల అద్దెలు, నిల్వ సమస్యల కారణంగా యాదాద్రి జిల్లాలో ఈ టెండర్​
  •      యాసంగిలో 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి
  •      మిల్లర్ల మొరాయింపుతో ఇంటర్మీడియట్ గోడౌన్లలో 1.31 లక్షల టన్నుల స్టాక్ నిల్వ
  •      బస్తాకు ప్రతినెలా రూ. 5 చొప్పున నెలకు రూ.1.60 కోట్లు చెల్లిస్తున్న సివిల్ సప్లయ్
  •      ఈ నెల 28 వరకు బిడ్లకు గడువు.. ప్రభుత్వానికి రూ.110 కోట్ల నష్టం!

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో 2025–26 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో ఊహించిన దానికంటే అధికంగా ధాన్యం దిగుబడి వచ్చింది. దానికి తోడు రైతుల నుంచి సేకరించిన వడ్లను దించుకోకుండా మిల్లర్లు మొరాయించారు. దీంతో ఇంటర్​ మీడియట్​ గోడౌన్లలో 1.31 లక్షల టన్నుల వడ్లను  స్టాక్​ చేశారు. ఈ క్రమంలో గోడౌన్ల అద్దెలు, నిల్వ సమస్యల కారణంగా కొన్న ధరకే వడ్ల విక్రయించేందుకు ఈ టెండర్లు పిలుస్తూ సివిల్ సప్లయ్ డిపార్ట్​మెంట్​ సంచలన నిర్ణయం తీసుకుంది. 

అద్దె మహా బరువు

ప్రతి సీజన్​లో సేకరించిన వడ్లను మిల్లర్లకు అప్పగించడం, ఆతర్వాత సీఎంఆర్​ సేకరణపైనే సివిల్​ సప్లయ్​ దృష్టి సారించేది. యాసంగి సీజన్​కు సంబంధించి ఈ రెండింటితో పాటు అదనంగా వడ్లను నిల్వ చేసిన గోడౌన్ల మెయింటనెన్స్​ బాధ్యత కూడా పడింది. గోడౌన్లలో నిల్వ చేసినందుకు, వాటిని మెయింటనెన్స్​ చేయడానికి అద్దె చెల్లించాల్సిన పరిస్థితి సివిల్​ సప్లయ్​పై పడింది. 40 కిలోల వడ్ల బస్తాకు ప్రతినెలా రూ. 5 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతినెలా రూ. 1.60 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. గత  మూడు నెలలుగా రూ. 4.80 కోట్ల అద్దె చెల్లించాల్సి వచ్చింది. 

బరువు దించుకోవడానికి నిర్ణయం.. 

వానాకాలం 2026 సీజన్​ వడ్ల కొనుగోలు సమయం దగ్గరకు వస్తోంది. మరోవైపు మిల్లర్ల నుంచి పెద్దగా సహకారం ఉండడం లేదు. కొనుగోలు చేసిన వడ్లను నిల్వ చేయడానికి మళ్లీ గోడౌన్లు కావాల్సి వస్తుంది. పక్క జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఎక్కడా గోడౌన్లు దొరికేలా  కన్పించడం లేదు. పైగా యాసంగిలో మొత్తం దొడ్డు రకాలే కావడంతో మరాడించి రేషన్​ షాపులకు పంపించే పరిస్థితి కూడా లేదు. దీంతో నిల్వ ఉన్న దొడ్డు వడ్లను అమ్మేసుకుంటే అద్దె బరువుతో పాటు గోడౌన్ల సమస్య తీరుతుందన్న నిర్ణయానికి సివిల్ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ వచ్చేసింది.  

రూ. 110 కోట్ల నష్టం!

యాసంగి సీజన్​ వడ్లను క్వింటాల్​కు రూ. 2,389 చెల్లించి రైతుల నుంచి సివిల్​ సప్లయ్​ కొనుగోలు చేసింది. ట్రాన్స్​ పోర్ట్​, ఏజెన్సీలకు కమీషన్​, హమాలీ ఇతర ఖర్చులు కలుపుకొని క్వింటాల్​కు రూ.3 వేలు అవుతోంది. సీఎంఆర్​ కోసం వీటిని మిల్లర్లకు ఇవ్వడం, ఏడాదికి పైగా మిల్లుల్లోనే ఉండడం జరుగుతోంది. పైగా మిల్లర్లు తరచూ ఇబ్బంది పెట్టడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది. దీంతో కొనుగోలు చేసిన రూ. 2,389 రేటుకే అమ్మేసుకోవాలని నిర్ణయానికి వచ్చి ఈ టెండర్లు ఆహ్వానించి, ఈ నెల 28 వరకూ బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. 

ఇప్పుడు నిర్ణయించిన ఈ  రేటు కంటే ఎక్కువ వేసిన బిడ్డర్​కు వడ్లను అప్పగిస్తారు. నిర్ణయించిన రేటు ప్రకారమే బిడ్లు దాఖలైనా.. సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​కు క్వింటాల్​కు రూ. 611 నష్టం వస్తుంది. ఈ లెక్కన 1.81 లక్షల టన్నుల వడ్లను టెండర్​లో విక్రయిస్తే రూ. 110 కోట్ల నష్టం వస్తుంది. దీంతో పాటు ఇప్పటివరకూ చెల్లించిన అద్దెతో పాటు ప్రస్తుత నెలకు సంబంధించిన అద్దె లెక్కించుకుంటే మరో రూ. 6.40 కోట్ల నష్టం కలగనుంది. ఈ టెండర్లలో మిల్లర్లు పాల్గొనే అవకాశం కన్పిస్తోంది. వడ్లను దక్కించుకొని మిల్లుల్లో తరుగు ఉన్న స్టాక్​ను పూడ్చుకునే అవకాశాలు ఉన్నాయి.