బంగారు భారతదేశం తయారు చేసుకుందాం

బంగారు భారతదేశం  తయారు చేసుకుందాం

సంగారెడ్డి, వెలుగు: ‘‘బంగారు తెలంగాణ ఎట్ల తయారు చేసుకున్నమో బంగారు భారతదేశం కూడా అట్లనే తయారు చేసుకుందాం” అని సీఎం కేసీఆర్​ అన్నారు. తాను పోరాటానికి బయల్దేరానని, జనం దీవెనలు కావాలని కోరారు. అమెరికాకన్న గొప్పగా భారత దేశాన్ని తయారు చేసుకోవాలన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణ్​ఖేడ్​లో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్​ ఇరి

  • బంగారు తెలంగాణ చేసుకున్నం..ఇగ బంగారు భారతదేశం
  • దేశం కోసం పోరాటానికి బయల్దేరిన: కేసీఆర్​
  • అమెరికాకన్నా గొప్పగా దేశాన్ని తయారు చేసుకోవాలె
  • ఏడేండ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారినయ్​
  • అన్నిరంగాల్లో దూసుకుపోతున్నం.. నంబర్​ వన్​గా ఉన్నం
  • ఇక్కడ 24 గంటలూ కరెంట్.. 
  • ఏపీలో అంధకారం: సీఎం
  • నారాయణ్​ఖేడ్​లో సంగమేశ్వర, 
  • బసవేశ్వర లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టులకు శంకుస్థాపన

గేషన్​ ప్రాజెక్టులకు ఆయన​ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘‘ఏమ్మా.. పోదామా? ఢిల్లీ దాకా కొట్లాడుదామా? భారతదేశాన్ని బాగుచేద్దామా?’’ అంటూ ప్రజలను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ప్రస్తుత దేశరాజకీయాలు కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ నడుస్తున్నాయని సీఎం విమర్శించారు. దేశాన్ని బాగుచేయాల్సిన అవసరం వచ్చినందునే ఇకపై తాను సెంట్రల్​  పాలిటిక్స్​పై దృష్టి పెట్టినట్లు సీఎం చెప్పారు. తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందని అప్పట్లో అసత్యాలు ప్రచారం చేశారని, ఇప్పుడు ఏపీలోనే అంధకారం ఉందన్నారు. ఏడేండ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. తాగు నీళ్లు, సాగు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. 

అన్ని రంగాల్లో మనం నంబర్​ వన్​
‘‘తెలంగాణ ఏర్పడే ముందు ఎన్నో అనుమానాలు కల్పించిన్రు. కరెంట్​ రాదు, పరిశ్రమలు తరలిపోతాయని భయపెట్టిన్రు. మనకు పరిపాలన చేతగాదని మాట్లాడిన్రు. ఎవరైతే మాట్లాడిన్రో ఇప్పుడు వాళ్ల దగ్గర కరెంట్​ లేదు. మన దగ్గర 24 గంటల కరెంట్​ ఉంది. 24 గంటలు కరెంట్​ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే” అని సీఎం చెప్పారు.  మంచినీటి బాధలు శాశ్వతంగా పోయాయని, గురుకులాల సంఖ్యను పెంచడంతో పాటు విదేశాలకు వెళ్లి చదివే ఒక్కో స్టూడెంట్​కు రూ. 20 లక్షలు ఇస్తున్నామన్నారు.  తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్​ వినియోగంలో తెలంగాణ స్టేట్​ దేశంలోనే నంబర్ వన్​ స్థానానికి ఎదిగిందని తెలిపారు. ‘‘ఆసరా, కల్యాణలక్ష్మి, దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా  స్కీములు దేశంలో ఎక్కడా లేవు. మహారాష్ట్ర బార్డర్​లో ఉన్న ప్రజలు తమకూ అలాంటి స్కీములు కావాలని అడుగుతున్నట్లు మొన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ థాక్రే చెప్పిండు. ఆ స్కీములు ఎట్లా అమలుచేస్తున్నరని ఆయన అడిగిండు” అని కేసీఆర్​ పేర్కొన్నారు. ఏడేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, గతంలో సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తెస్తానని ఇచ్చిన హమీ మేరకు 4 వేల కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.

తెలంగాణ పథకాలను దేశమంతా కోరుతున్నది
తెలంగాణలో జరిగే పనులు, పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేయాలని దేశప్రజలు కోరుతున్నారని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఎట్లాగైతే తెలంగాణను బాగు చేసుకున్నామో ఇయ్యాళ భారతదేశ రాజకీయాల్లో గూడ మనం ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్పదేశంగా తయారుచేసే దిశగా ముందుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మనం అమెరికా పోవుడుగాదు, ఇతర దేశాలే వీసాలు తీసుకొని భారతదేశానికి వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకు అవసరమైన గొప్ప సంపద, గొప్ప వనరులు, గొప్ప యువశక్తి ఈ దేశంలో ఉన్నయ్​. దేశాన్ని బాగు చేసుకోవాలె.. అందుకే నేను పోరాటానికి బయలుదేరిన. మీ అందరి దీవెన ఉండాలె” అని చెప్పారు. 

మంత్రి హరీశ్​.. అద్భుతంగా పని జేస్తుండు 
మంత్రి హరీశ్​రావు అద్భుతంగా పని చేస్తున్నారని సీఎం కేసీఆర్​ ప్రసంశించారు. ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అన్ని రంగాల అభివృద్ధికి ముందుంటున్నారని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్​ రోడ్ల డెవలప్​మెంట్ కోసం అవసరమయ్యే ఫండ్స్ గురించి శాఖా పరంగా మీటింగ్ పెట్టి చర్చించాలని హరీశ్​ రావుకు ఆయన సూచించారు. ఆర్ధిక శాఖ హరీశ్​ చేతుల్లోనే ఉన్నందున రోడ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఫండ్స్ ఆయన  సమర్ధవంతంగా కేటాయింపులు చేయగలరని కేసీఆర్​ అన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్​​ ఇరిగేషన్​ పనులను ఏడాదిన్నర లోగా పూర్తి చేసే బాధ్యత కూడా హరీశ్​పైనే ఉందని సూచించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతో పాటు ఎంపీలు బీబీ పాటిల్​, కొత్త ప్రభాకర్​ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్​ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్​, మాణిక్ రావు, మహిపాల్ రెడ్డి, పద్మా దేవేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్​ వరాలు..
సంగారెడ్డి జిల్లాపై సీఎం కేసీఆర్​ వరాల జల్లులు కురిపించారు. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా, ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ. 50కోట్లు, జహీరాబాద్ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలైన సదాశివపేట, నారాయణ్​ఖేడ్​, ఆందోల్-– జోగిపేట, అమీన్​పూర్​, తెల్లాపూర్​, బొల్లారానికి రూ. 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మధ్య వరుసగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని టార్గెట్​ చేస్తూ మాట్లాడుతున్న సీఎం కేసీఆర్​.. తాను దేశ రాజకీయాల్లోకి పోతున్నానని, దేశం అమెరికా కన్నా గొప్పగా మారాలని అన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని, ఇగ దేశాన్ని బంగారు భారతదేశం చేసుకుందామని చెప్పారు. అనేక రంగాల్లో దేశంలో తెలంగాణ నంబర్​ వన్​గా నిలబడిందని,  ఇక్కడ జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని ప్రజలు కోరుతున్నారని ఆయన అన్నారు. 
దేశం గూడా బాగుండాల్సిన అక్కర ఉన్నది. దేశం గురించి మనం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనం ఇంకింత  పైకి పోయే అవకాశముంటది. పేపర్లు, టీవీలల్ల చూసి ఉంటరు. ఈమధ్య నేను జాతీయ రాజకీయాల్లో గూడా పోయి మాట్లాడుతా ఉన్న.. పనిచేస్తా ఉన్నా. పోదామా? జాతీయ రాజకీయాల్లో.. కొట్లాడుదామా? భారతదేశాన్ని బాగుచేద్దామా?మనం అమెరికా పోవుడుగాదు, ఇతర దేశాలే వీసాలు తీసుకొని భారతదేశానికి వచ్చే పరిస్థితి వస్తుంది. దేశాన్ని బాగు చేసుకో వాలె.. అందుకే పోరాటానికి బయలుదేరిన. మీ దీవెన ఉండాలె.
‑ నారాయణ్​​ఖేడ్​ సభలో సీఎం కేసీఆర్​