సందిచ్చి చిందులు..ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్ డైరెక్షన్

సందిచ్చి చిందులు..ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్ డైరెక్షన్
  • జీవో ఇచ్చినప్పుడు అడగలేదు.. 
  • టెండర్లు పిలిచినప్పుడూ అడ్డుకోలేదు
  • టెండర్లు అయ్యేదాకా అపెక్స్​ మీటింగ్​కు డుమ్మా
  • పనులు మొదలైనట్లు ఫొటోలేసినా పట్టించుకోలే
  • ఇప్పుడు సెంటిమెంట్​ను రెచ్చగొడుతూ లొల్లి లొల్లి

హైదరాబాద్​, వెలుగు: ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు రెండేండ్లుగా మాట సాయంతో పాటు చేతనైనంత సహకరించిన సీఎం కేసీఆర్​... సడెన్​గా ఇంకో సైడ్​ తీసుకున్నారు. ఏపీ నీళ్ల దోపీడీ చేస్తోందని, తెలంగాణకు అన్యాయం జరిగిపోతోందని హడావుడిగా మంత్రులతో మాట్లాడిస్తున్నారు. ‘ఏపీ సీఎం జగన్​ గొప్పోడు..’ అంటూ జగన్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అంతెత్తు పొగిడిన కేసీఆర్​.. ఇప్పుడు వైఎస్​ను మించిన గజదొంగ జగన్​ అంటూ మంత్రులతో తిట్టిస్తున్నారు. ‘బేసిన్లు లేవు, భేషజాలు లేవు... కలిసికట్టుగా నీళ్లను పంచుకుందాం..’ అని రెండు రాష్ట్రాలకు తానే పెద్దన్న అన్నట్లు చెప్పుకొచ్చిన కేసీఆర్​.. ఇప్పుడు తప్పు మొత్తం ఏపీపై నెట్టేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. గోదావరి నీళ్లను తరలించి రాయలసీమను సస్య శ్యామలం చేస్తామని తిరుపతి పర్యటనకు వెళ్లినప్పుడు మాట ఇచ్చిన కేసీఆర్..​ ఇప్పుడు ఏపీ సర్కారుపై మండిపడాలని మినిస్టర్లను ఎగేస్తున్నారు. గోదావరి‌‌ నీళ్లను కృష్ణాకు లింక్​ చేస్తూ ఉమ్మడి ఎత్తిపోతల ప్రాజెక్టు కడుతామంటూ ఏపీ సీఎం జగన్​తో భేటీ అయిన కేసీఆర్​.. ఇప్పుడు కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకుపోతోందంటూ మంత్రులతో పోరాటం చేయిస్తున్నారు. సీఎం ఆదేశాలతో మంత్రులు ఒక్కరొక్కరుగా ఏపీ సర్కారుపై గరం గరం అవుతున్నారు. ఇంతకాలం ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న విషయం తమకు తెలియదని ప్రజలను నమ్మించేందుకు దక్షిణ తెలంగాణ మంత్రులు కిందమీద పడుతున్నారు. 

ప్రాజెక్టులు కడుతున్న ఫొటోలు ఇటీవలే దొరికాయని, ఇక ఆగే ప్రసక్తే లేదని, కృష్ణా నీళ్లపై ఏపీతో ఎందాకైనా పోరాటం చేస్తామని రోజుకో తీరుగా సెంటిమెంట్​ మాటలు  రాజేస్తున్నారు. మొన్నటిదాకా ఏపీ సీఎం జగన్​ను అంతెత్తు పొగిడిన కేసీఆర్​.. ఇప్పుడు సొంత మంత్రులను ఏపీ సర్కారుపై ఎక్కుపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడల్లా, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా రాజకీయంగా నిలదొక్కుకునేందుకు కేసీఆర్​ తెలంగాణ సెంటిమెంట్​ను ముందుకు తెస్తారనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే ఏపీతో నీళ్ల లొల్లిని మళ్లీ రాజేసినట్లు స్పష్టమవుతోంది. 

అప్పుడు నిజాయితీపరుడు.. ఇప్పుడు దొంగనా!

ఏపీలో జగన్​ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆయనకు, కేసీఆర్​కు  మధ్య దోస్తానా కుదిరింది. 2019 మేలో ఏపీ సీఎంగా జగన్  ప్రమాణస్వీకారానికి కేసీఆర్ వెళ్లారు. వైఎస్ అద్భుతమైన వారసత్వాన్ని కొనసాగించాలని ఆయనకు కేసీఆర్​ మార్గనిర్దేశం చేశారు. తర్వాత రెండు మూడు సార్లు ఇద్దరు సీఎంల మధ్య చర్చలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్​ హాజరయ్యారు.  తామిద్దరం మంచి అవగాహనతో ఉన్నామని, జగన్ నిజాయితీపరుడని, గోదావరి జలాలు, కృష్ణా జలాలు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం మెట్ట ప్రాంతాలకూ అందించాలని స్వయంగా కేసీఆర్  ప్రకటించారు. రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల నీళ్ల గొడవపై ఇక కేంద్ర ప్రభుత్వం  జోక్యం చేసుకునే దుర్గతి ఉండదని కేసీఆర్ తేల్చేశారు. ఇప్పుడు అదే నీళ్ల లొల్లి రేపి.. జగన్​ దొంగ అని మంత్రులతో మాట్లాడిస్తున్నారు. 

టెండర్లు అయ్యేదాకా కేసీఆర్​ డుమ్మా

ఏపీ అక్రమ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచిన టైమ్​లోనే కేంద్ర ప్రభుత్వం అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​కు ఆహ్వానించింది. తెలంగాణ తరఫున ప్రభుత్వ వాదన వినిపించి ఏపీ టెండర్లను కట్టడి చేసేందుకు అసలు సిసలైన వేదికను వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం డుమ్మా కొట్టింది. 2020 ఆగస్టు 5న కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​కు పిలువగా.. కొత్త సెక్రటేరియట్​ నిర్మాణంపై చర్చించేందుకు కేబినెట్​ మీటింగ్​ ఉందనే సాకుతో అపెక్స్​ మీటింగ్​ను  వాయిదా వేయాలని కేసీఆర్​  కోరారు. దీంతో టెండర్లు పూర్తి చేసేందుకు పరోక్షంగా ఏపీకి సహకరించినట్లయింది. అదే నెల 19న రాయలసీమ లిఫ్ట్ టెండర్లకు గడువు పూర్తింది. అపెక్స్ మీటింగ్ 5నే జరిగి కేసీఆర్ దీనిపై మాట్లాడి ఉంటే ఏపీ అక్రమ ప్రాజెక్టులను ప్రస్తావించి అడ్డుకునే అవకాశం ఉండేది. కానీ.. అడ్డుకునే ఆలోచన కేసీఆర్​కు లేదని.. ఈ మీటింగ్​ వాయిదా వేయించుకోవటంతో మరోసారి బయటపడింది. 

ఇప్పుడు రాజకీయ ఎజెండా

పాలమూరు ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం పదేపదే బయటపడడం, ఇటు హుజూరాబాద్ ఎన్నికలు రావడంతో కేసీఆర్ కు సెగ తగిలింది. దీంతో ఇప్పుడే ఏపీ అక్రమ ప్రాజెక్టులు గుర్తుకొచ్చినట్లు డ్రామా మొదలుపెట్టారు. ఏడాదిన్నరగా శిలా విగ్రహాల్లా ఉన్న మంత్రులతో ఒకరొకరిగా స్క్రిప్టులు చదివించడం మొదలుపెట్టారు. ఫొటోలు బయటపెట్టిన ఏడు నెలల తర్వాత ఇప్పుడు ‘మాకు ఫొటోలు దొరకడం లేటైంది. అందుకే కంప్లెయింట్ చేయలేకపోం’ అని ఉత్తర తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్లు ఈ మధ్యే తమకు తెలిసిందని ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు కేసీఆర్-– జగన్ కుతంత్రాలకు జనాన్ని బలిచేసే కుట్రకు తెరతీశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా అటూ ఇటూ మంత్రులు మాట్లాడడం మొదలుపెట్టారు. లంకలో పుట్టినోళ్లు రాక్షసులని, ఆంధ్రోళ్లు ఎవరూ తెలంగాణకు మంచి జరగాలని కోరుకోరని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. అనాలనుకున్నది అనేసి.. అందరినీ కాదని, పాలకులనేనని ఆయన తర్వాత వివరణ ఇచ్చారు. 

కృష్ణా ప్రాజెక్టులపై పట్టింపు లేదు

తెలంగాణ వచ్చినప్పటి నుంచీ కృష్ణా ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉన్న నిధులన్నీ కాళేశ్వరం వైపు మళ్లించి.. కేసీఆర్​ ఫామ్​హౌస్​  వరకు గోదావరి నీళ్లను ఎత్తిపోసేందుకు రూ. లక్ష కోట్లకు పైగా అప్పులు చేసింది. ఆ టైమ్​లో దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కృష్ణాకు ఆశించిన వరద రావటం లేదని, అవసరమైతే గోదావరి నీళ్లను శ్రీశైలం వరకు తీసుకెళ్లే భారీ లిఫ్ట్ ప్రాజెక్టు కడుతామంటూ రెండేండ్ల కిందట మాస్టర్​ ప్లాన్​ వేసింది కేసీఆరే.  ప్రగతి భవన్​లో ఏపీ సీఎం జగన్ తో భేటీ  సందర్భంగా ఈ ప్రాజెక్టుపైఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. సాధ్యాసాధ్యాల రిపోర్టును తయారు చేయాలని  రెండు రాష్ట్రాల ఇరిగేషన్​ ఇంజనీర్లను ఆదేశించారు. రెండు భేటీలు జరిగాక, ఈ ప్రాజెక్టు డిజైన్లు కుదరక ఏపీ నో చెప్పింది. రూ. 50 వేల కోట్లతో కట్టాలనుకున్న ఈ ప్రాజెక్టును రెండు ప్రభుత్వాలకు ఉమ్మడి దోస్తీ మేఘా కంపెనీకే  ఇద్దామనుకున్నారు. మన ప్రాంత భూములను ముంచి.. మన నిధులతో గోదావరి నీళ్లను కృష్ణాకు మళ్లిస్తే తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నకు రాష్ట్ర సర్కారు నుంచి సమాధానం లేదు.

నీళ్లు తీసుకోండి అని చెప్పిన

‘‘చంద్రబాబుకు అమరావతిలోని వాళ్లింట్లో చెప్పిన.. ‘నీళ్లు సముద్రంలకు వేస్టుగా పోతున్నయ్‌‌‌‌‌‌‌‌.. దిక్కుమాలిన పంచాయితీలు బంద్‌‌‌‌‌‌‌‌ చెయ్యి.. ఆ నీళ్లు వాడుకుందాం.. సమైక్య రాష్ట్రంల ఉన్నప్పుడు అట్లనే చేసిండ్రు.. రాష్ట్ర విభజనకు దోహదమైండ్రు.. ఇయ్యాల కూడా మీ వైఖరి మారుతలేదు’ అన్ని చెప్తే ఆయన వినలే. ఎన్నో కేసులు పెట్టిండు.. ఎంతో సతాయించిండు.. వైఎస్‌‌‌‌‌‌‌‌ జగన్‌‌‌‌‌‌‌‌ సీఎం అయ్యాక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. బేసిన్‌‌‌‌‌‌‌‌లు లేవు.. భేషజాలు లేవు అని నేను చెప్పిన. పాత పంచాయితీలు బంద్‌‌‌‌‌‌‌‌ చేసి, ఉభయ రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టులు చేసుకుందాం అని చెప్పిన. జగన్‌‌‌‌‌‌‌‌ యువకుడైనా ఆయనకు నిజాయితీ ఉంది. అంతకుముందు ముఖ్యమంత్రి వినలే. కానీ వీరు ‘మేం చేసుకుంటం సార్‌‌‌‌‌‌‌‌ మీ సహకారం కావాలే’ అన్నరు. డెఫినెట్‌‌‌‌‌‌‌‌గా చేస్తామన్నం. మా బాధ తీరుతది.. మీ బాధ తీరుతది.. రాయలసీమ బతుకుతది.. నెల్లూరు అప్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌, ప్రకాశం అప్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌కు నీళ్లు తీసుకోండి అని చెప్పిన. బంగాళాఖాతంలకు పోయినదానికంటే మీరు ఎందుకు బతకొద్దు అని చెప్పిన. అలాంటి సహృదయంతోనే ఇద్దరం పనిచేస్తున్నం.’’
- 2019 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌19న గోదావరి - కృష్ణా నదుల లింక్‌‌‌‌‌‌‌‌పై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ 

కేసీఆర్​తో భేటీ తర్వాతే పనులు మొదలుపెట్టిన ఏపీ

గోదావరి–-కృష్ణా లింక్ ప్రాజెక్టు అయ్యేది కాదని అర్థమయ్యాకే జగన్ సర్కారు కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించేందుకు రాయలసీమ లిఫ్ట్ పేరుతో పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ప్రాజెక్టులను డిజైన్ చేసింది. జగన్ సర్కారు అక్రమ ప్రాజెక్టుల ఆలోచన చేస్తోందని 2019 డిసెంబర్ 13 నుంచి ‘వీ6-– వెలుగు’ వరుస కథనాలతో అలర్ట్ చేసింది. 2020 మే 5వ తేదీన సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ కోసం ఏపీ ప్రభుత్వం బాజాప్త జీవో నం. 203 జారీ చేసింది. రూ.6,820 కోట్లతో పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చేసింది. ఇదంతా కేసీఆర్​తో జగన్​ భేటీ తర్వాతే జరిగింది.

కేసీఆర్​ గతంలో హామీ ఇచ్చారు..

పెద్దన్నలా ముందుండి రాయలసీమకు నీళ్లు వెళ్లేలా చూస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్​ గతంలో హామీ ఇచ్చారు. ‘రాయలసీమ అవస్థలు మాకు తెలుసు.. దానికి శాశ్వత పరిష్కారం చూపడంలో నేను ముందుంటా’నని అప్పుడు అన్నారు. దాని ప్రకారమే కాల్వల వెడల్పు కోసం నమూనాలు మొదలుపెట్టాం. 
‑ సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు

ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే?

నీళ్ల లొల్లి పెద్ద డ్రామా. కేసీఆర్, జగన్‌ల రాజకీయ నాటకాలకు ప్రజలు మోసపోవద్దు. అప్పుడు స్వీట్లు తినిపించుకుని ఇప్పుడు డ్రామాలాడుతున్నరు. హుజూరాబాద్ ఎన్నికలో లబ్ధి పొందాలని ప్లాన్ చేసిన్రు. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఇప్పుడెందుకు ఎగిరెగిరి పడుతున్నరు.  
‑ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

బేసిన్లు లేవ్.. భేషజాల్లేవ్.  రెండు రాష్ట్రాల నీళ్లపై కేంద్రం జోక్యం చేసుకునే దుర్గతి లేదు.‑ 2019 జూన్  28:  ప్రగతిభవన్​లో ఏపీ సీఎం జగన్​తో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్​

జగన్ నిజాయితీపరుడు, నీళ్లు తీసుకోవాలని నేనే చెప్పిన.  ‑ 2019 సెప్టెంబర్ 15: అసెంబ్లీలో సీఎం కేసీఆర్

రతనాల సీమగా మారుస్త

‘‘రాయలసీమను రతనాల సీమగా మారుస్త.. గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలు వృథా అయ్యాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ కూడా నిండి కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. నీళ్లు అలా వృథా కాకుండా నేనూ, జగన్‌ చర్చించుకున్నాం. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి. రాయలసీమకు గోదావరి జలాలు రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకంగా, పట్టుదలగా పనిచేసే జగన్‌ సీఎంగా ఉన్నారు. రాయలసీమ కష్టాలు నాకు తెలుసు. జగన్‌కు పెద్దన్నగా కష్టాలు తీర్చడంలో నా ఆశీస్సులు, సంపూర్ణ సహకారం ఉంటాయి. ’’ - 
‑ 2019 ఆగస్టు 12న కంచికి వెళ్లి వస్తూ నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంట్లో కేసీఆర్‌ చెప్పిన మాటలివి

ఆపటం ఇష్టం లేని మన లీడర్లు

ఏపీ అక్రమ ప్రాజెక్టులు ప్లాన్​ చేసింది మొదలు, పనులు తలపెట్టేంత వరకు ఏడాదిన్నర కాలంగా ‘వీ6, వెలుగు’ వరుస కథనాలు, వీడియోలు, ఫొటోలతో వెంటపడ్డాయి. తెలంగాణకు ముప్పు ముంచుకు వస్తోందని అప్రమత్తం చేశాయి.  సీఎం కేసీఆర్ సహా మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్ నుంచి ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ తో పాటు టీఆర్​ఎస్​ లీడర్లెవరూ అప్పుడు నోరెత్తింది లేదు. ఉద్యమంలో పోతిరెడ్డిపాడు విస్తరణ అంశంపైనే పోరాడిన చరిత్రను మరిచిపోయి నాటి ఉద్యమకారులు, ఉద్యమాన్ని వ్యతిరేకించిన నేటి మంత్రులు ఒక్కరూ స్పందించలేదు. కేసీఆర్–-జగన్ కు మధ్య జరిగిన ఒప్పందంలో తెలంగాణ మంత్రులుగా వీళ్లంతా భాగం పంచుకున్నారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేసే పాపానికి వీళ్లే కారణమయ్యారు.

అక్కడ.. ఇక్కడ ముంచేది మేఘానే

ఇక్కడ కాళేశ్వరం, పాలమూరుతో పాటు మిషన్​ భగీరథ పనులు చేపట్టి రూ. లక్ష కోట్ల తెలంగాణ నిధులను సంపాదించుకున్న మేఘా కంపెనీనే ఏపీలో పోలవరంతో పాటు కొత్తగా మొదలుపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం పనులు చేపడుతోంది. ఈ అక్రమ ప్రాజెక్టుల్లో పాలమూరు జిల్లాకే చెందిన కొందరు టీఆర్ఎస్ కీలక నేతలు సబ్ కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వంత పాడుతున్నారని, అక్కడి పనులు,  నిధుల్లోనూ లీడర్లు వాటాలు పంచుకుంటున్నారనే విమర్శలున్నాయి.

ఎన్జీటీ తీర్పు ఇచ్చినా ఆగని ఏపీ

పర్మిషన్లతో పనిలేకుండా మేఘా కంపెనీ ఏపీ ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టింది. 2020 డిసెంబర్ 13న ‘వెలుగు’ పత్రిక అక్కడ పనులు జరుగుతున్న ఫొటోలతో స్టోరీ ప్రచురించింది. దీని వీడియోలను ‘వీ6’ ప్రసారం చేసింది. తెలంగాణ సర్కారు మాత్రం కదల్లేదు. ఈ స్టోరీల ఆధారంగా గవినోళ్ల శ్రీనివాస్ మరోసారి ఎన్జీటీని ఆశ్రయించారు. ఏపీ సర్కారుపై ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ పైనే ఇటీవల జూన్ 25న ఎన్జీటీ మరోసారి ఆదేశాలిచ్చింది. పనులు జరుగుతున్నట్లు పరిశీలనలో తేలితే ఏపీ సీఎస్ ను జైలుకు పంపిస్తామని సీరియస్ వార్నింగ్​ ఇచ్చింది.  ఎన్జీటీలో మొదట స్టే, తర్వాత తీర్పు, ఇప్పుడు ఏపీకి వార్నింగ్ ఇవ్వటం వెనుక ఒక వ్యక్తి న్యాయపోరాటం తప్ప.. రాష్ట్ర సర్కారు ప్రయత్నమేమీ లేకపోవటం గమనార్హం. ఇంత జరిగినప్పుడు కండ్లు మూసుకున్న మంత్రులు.. ఇప్పుడు ఆగమాగం తెలంగాణ ప్రయోజనాలు మంటగలుస్తున్నాయని ఏపీపై మండిపడటం మరింత విచిత్రం.

అంతా అయిపోయినంక

ఏపీ సర్కారు జీవోలు ఇచ్చినా.. టెండర్లు పిలిచినా.. తెలంగాణ సర్కారు పట్టించుకోలేదు. టెండర్లయ్యే వరకు ఏపీకి పరోక్షంగా సహకరిం చే ప్లాన్లు వేసింది. దీంతో 2020 మే 21న నారాయణపేట జిల్లాకు చెందిన రైతు  గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్​ వేశారు. పర్యావరణ అనుమతుల్లేవనే కారణంగా ఎన్జీటీ స్టే ఇచ్చింది. ఈ ప్రాజెక్టు స్టేటస్ ను, ప్రభావాన్ని పరిశీలిం చాలని కమిటీని వేసింది. అప్పటివరకు స్పందన లేని రాష్ట్ర సర్కారు హడావుడి మొదలు పెట్టింది. ఎన్జీటీ స్టే ఇచ్చిన మూడు నెలల తర్వాత ఆగస్టు 21న కేసు రీఓపెన్ కోసం పిటిషన్ వేసింది. అప్పటికే గవినోళ్ల శ్రీనివాస్​ పిటిషన్ పై విచారణ పూర్తయింది. తెలంగాణ  ప్రభుత్వ పిటిషన్​ కారణంగా ఈ తీర్పును ఆపేసిన ఎన్జీటీ విచారణ కొనసాగించింది. తీర్పు మరింత ఆలస్యం కావడం పరోక్షంగా ఏపీకి కలిసొచ్చింది. నిపుణుల కమిటీ రిపోర్ట్ ఆధారంగా, అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతే పనులు చేయాలని 2020 అక్టోబర్ 29న ఎన్జీటీ తీర్పు చెప్పింది. అప్పటికే ఏపీ టెండర్ల ప్రక్రియ పూర్తయింది.