పడిపోతున్న కేసీఆర్ గ్రాఫ్‌

పడిపోతున్న కేసీఆర్ గ్రాఫ్‌
  • దేశంలోనే ప్రజాగ్రహం ఎక్కువగా ఉన్న సీఎంలలో ఫస్ట్ ప్లేస్ 
  • రాష్ట్రంలో 30.3% మంది వ్యతిరేకిస్తున్నరు
  • ‘ఐఏఎన్ఎస్ సీవోటర్’ సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ పట్ల జనంలో వ్యతిరేకత పెరుగుతున్నది.  దేశంలో ప్రజల నుంచి అత్యధిక వ్యతిరేకత ఎదుర్కొంటున్న సీఎంలలో ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉన్నరు. రాష్ట్రంలో దాదాపు 30.3 శాతం మంది ప్రజల్లో సీఎం కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, జనం మార్పును కోరుకుంటున్నారని ఐఏఎన్ఎస్ సీవోటర్ సర్వేలో వెల్లడైంది. ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ అతితక్కువ ప్రజా వ్యతిరేకతతో దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలవగా.. అత్యధిక ప్రజా వ్యతిరేకతతో సీఎం కేసీఆర్ అట్టడుగు స్థానంలో నిలిచారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, యూటీల ప్రభుత్వాలు, వాటి సీఎంల పనితీరును అంచనా వేస్తూ ఈ మేరకు ‘‘ఐఏఎన్ఎస్ సీవోటర్ గవర్నెన్స్ ఇండెక్స్’’ పేరుతో సర్వే రిపోర్ట్ విడుదలైంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలపైనా జనం చాలా కోపంతో ఉన్నారని, ప్రధానంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 23.5 శాతం మంది వ్యతిరేకతతో ఉన్నారని సర్వే తేల్చిచెప్పింది. దేశంలో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత విషయంలో రాష్ట్రం మూడో ప్లేస్ లో ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తక్కువగానే ఉందని, కేసీఆర్ పాపులారిటీ పడిపోతుండటంతో ఇక్కడ బీజేపీ బాగా ఎదిగే అవకాశాలు కన్పిస్తున్నాయని సీవోటర్ ఫౌండర్ యశ్వంత్ దేశ్ ముఖ్ అభిప్రాయపడ్డారు. చివరకు ఈశాన్య రాష్ట్రాల సీఎంలు అందరిపై ఉన్న వ్యతిరేకత (29.2) కన్నా కేసీఆర్ పై వ్యతిరేకతే ఎక్కువగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ స్థానాన్ని ఆయన కొడుకు కేటీ రామారావు భర్తీ చేసేందుకు ఇదే తగిన సమయమని, లేకపోతే పరిస్థితులు చేయిజారిపోవడం ఖాయమన్నారు.

 
యోగి, జగన్‌‌లకూ ఎదురుగాలి 

సీఎం కేసీఆర్ తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. యూపీ సీఎంపై 28.1 శాతం మంది వ్యతిరేకతతో ఉన్నారు. అయితే, యూపీలో ఇప్పటికీ బీజేపీకి 40 శాతం మద్దతు ఉందని, ఆ పార్టీ ఇప్పటికీ అక్కడ బలంగా ఉందని దేశ్ ముఖ్ అన్నారు. ఇక ఏపీలో ప్రధానంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఏపీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 28.5 శాతం మంది కోపంతో ఉన్నారు. ఇతర ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలపై ఇంత వ్యతిరేకత లేదు. ఏపీ ప్రతిపక్ష పార్టీకి 20 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున, సహజంగానే అపొజిషన్ పై తక్కువగా, రూలింగ్ వైఎస్సార్ సీపీపై ఎక్కువగా వ్యతిరేకత ఉందని సర్వే స్పష్టం చేసింది.

బెస్ట్ సీఎం భూపేశ్ బఘేల్

చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ దేశంలోనే బెస్ట్ సీఎంగా సర్వేలో తేలింది. బఘేల్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయన పట్ల ప్రజల్లో ఆదరణను పెంచాయని సర్వే పేర్కొంది. కరోనాతో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేందుకు తెచ్చిన పథకం అందరి మెప్పు పొందినట్లు తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 94 శాతం మంది బఘేల్ పాలనతో సంతోషంగా ఉన్నారని సర్వే పేర్కొంది. కేవలం 6 శాతం మందే ఆయన పనితీరుపై ఆగ్రహంతో ఉన్నారని వివరించింది. అలాగే సొంతంగా నిర్ణయాలు తీసుకునే విధానం, సీఈవో స్టైల్ పనితీరుతో ఆయన ప్రజల్లో పాపులారిటీ సాధించారని  సీవోటర్ ఫౌండర్ యశ్వంత్ దేశ్ ముఖ్ అభిప్రాయపడ్డారు. ఇక ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సర్వేలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన పట్ల 10.1 శాతం మందిలో మాత్రమే వ్యతిరేకత ఉంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మూడో ప్లేస్ లో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల 37.6 శాతం వ్యతిరేకత ఉన్నా, సీఎం పట్ల మాత్రం10.4 శాతం మందిలో మాత్రమే వ్యతిరేకత ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చడం కూడా ఆయా పార్టీలకు కొంత కలిసి వచ్చిందని సర్వే పేర్కొంది.