
ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్ ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఫిల్మ్ నగర్ లోని దర్శకుడి ఇంటికెళ్లిన సీఎం ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఈ విషయంపై విశ్వనాథ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తమ ఇంటికి మర్యాదపూర్వకంగా వచ్చారని, ఓ సినిమాలో పాట నచ్చి నన్ను కలుస్తానని, రాత్రి ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. కేసీఆర్ తమ ఇంటికి రావడం శ్రీ కృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్లుందని విశ్వనాథ్ తెలిపారు. తాను ఎలాంటి అనారోగ్యంతో బాధపడటం లేదని, తన అజ్ఞాత అభిమానిగానే కేసీఆర్ తమ ఇంటికి వచ్చారని, ఆయన సాహిత్య అభిరుచిని తనతో పంచుకున్నారని ఆయన అన్నారు. చాలామంది అభిమానులు తనను సినిమాలు తీయమంటున్నారని, కానీ తనకు సినిమాలు తీసే ఓపిక లేదని విశ్వనాథ్ తెలిపారు.