
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలన నయా నిజాం పాలనను తలపిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్మండిపడ్డారు. బుధవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నిజాంలా, నియంతలా మారి పాలన చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. తాను చెప్పిందే చెల్లాలంటూ హుకుం జారీ చేస్తున్నారని సీఎంపై ఫైర్ అయ్యారు. రాచరిక మనస్తత్వంతో కుటుంబ పాలన చేయాలనుకుంటున్నాడని విమర్శించారు. ప్రజలకు అనేక హామీలిచ్చి గజినీలాగా మర్చిపోయిండని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
"ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరేస్తాం" అన్న కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందపెడతారని చెప్పారు. తెలంగాణ కోసం బీజేపీ మరో మలిదశ ఉద్యమం ప్రారంభించిందని వెల్లడించారు. 'కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో..బీజేపీ జితావో' నినాదంతో ముందుకు వెళ్తామని వివరించారు. కేసీఆర్ సర్కార్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం (ఈ నెల24న) రాష్ట్ర మంత్రుల కార్యాలయాలను ఘెరావ్ చేస్తామని తెలిపారు. 25 న జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని.. సెప్టెంబర్ 7న ‘చలో హైదరాబాద్’ చేపడతామని వివరించారు.
30 శాతం కమీషన్ తీసుకున్నోళ్లకు టికెట్లేంది?
దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30% కమీషన్లు తీసుకున్నారని స్వయంగా కేసీఆరే చెప్పారని లక్ష్మణ్ గుర్తు చేశారు. మరి ఆ అవినీతి ఎమ్మెల్యేలకే మళ్లీ సీట్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, అణచివేతలను కొనసాగిస్తున్న ఈ సర్కార్.. ప్రజల పక్షాన నిలబడుతున్న బీజేపీ నేతలపై, కార్యకర్తలపై లాఠీచార్జ్‌లు చేయిస్తున్నదని ఆరోపించారు. పోలీసుల దెబ్బలకు, బీఆర్ఎస్ గూండాల దాడిలో వర్ధన్నపేటకు చెందిన దళిత నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌కు చేయి విరిగిందన్నారు. పలువురు మహిళా మోర్చా కార్యకర్తలు గాయపడ్డారని చెప్పారు. తమపై ఎన్ని దౌర్జన్యాలకు, హింసాత్మక ఘటనలకు పాల్పడినా రాజీపడేది లేదన్నారు. ఆనాడు నిజాం పాలనను తరిమికొట్టినట్లుగానే ఇప్పుడు బీఆర్ఎస్ ను తరిమికొడతామని హెచ్చరించారు.
మోదీ 4 కోట్ల మందికి ఇండ్లు కట్టించారు
నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేండ్లలో దేశంలో 4 కోట్ల మందికి ఇండ్లు కట్టించారని లక్ష్మణ్ తెలిపారు. ప్రగతి భవన్ ను రూ.150 కోట్లతో 11 నెలల్లోనే పూర్తి చేసిన బీఆర్ఎస్ సర్కార్.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా ఎందుకు కట్టించలేదని నిలదీశారు. 9 ఏండ్ల కేసీఆర్ పాలనలో కనీసం లక్ష ఇండ్ల నిర్మాణం కూడా పూర్తికాలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు.