క‌శ్మీర్‌పై క్లారిటీ, ఆత్మ నిర్భ‌ర భార‌త్ నినాదాన్ని ఓర్వ‌లేకే చైనా దుశ్చ‌ర్య‌లు

క‌శ్మీర్‌పై క్లారిటీ, ఆత్మ నిర్భ‌ర భార‌త్ నినాదాన్ని ఓర్వ‌లేకే చైనా దుశ్చ‌ర్య‌లు

చైనాతో స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు త‌లెత్తిన నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు సీఎం కేసీఆర్. అయితే ఏమాత్రం తొందరపాటు లేకుండా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని అన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలన్నారు. భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణలో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రులైన‌ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అఖిల‌ప‌క్ష భేటీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు. క‌శ్మీర్ విష‌యంలో ప్ర‌ధాని మోడీకి ఉన్న క్లారిటీ, పీవోకే మ‌న‌దేన‌ని ప్ర‌క‌ట‌న చేయడం స‌హా ప్ర‌పంచంలోనే బ‌ల‌మైన ఆర్థిక శ‌క్తిగా ఎదిగేందుకు ఆత్మ నిర్భ‌ర భార‌త్ నినాదాన్ని ఇవ్వ‌డంపై చైనా ఓర్వ‌లేక‌పోతోంద‌ని అన్నారు. దీంతో ఉద్దేశపూర్వ‌కంగానే డ్రాగ‌న్ కంట్రీ క‌య్యానికి కాలుదువ్వుతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని కేసీఆర్ చెప్పారు. చైనా, పాకిస్థాన్‌ల‌కు తమ దేశాల్లో అంతర్గత సమస్యలు త‌లెత్తిన‌ప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటుగా మారింద‌న్నారు. ఇప్పుడు చైనాలో అంతర్గత సమస్యలు రావ‌డంతోనే దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతోనూ ఘర్షణలకు దిగుతోంద‌న్నారు. చైనా త‌న‌ వైఖరితో ప్రపంచ వ్యాప్తంగా అపఖ్యాతి పాలైంద‌ని చెప్పారు.

ఆక్సాయ్‌చిన్ మ‌న‌దేన‌ని అమిత్ షా చెప్పారు

‘‘చైనా ఇటీవల కాలంలో భారతదేశంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తోంది. దానికి ప్రత్యేక కారణాలున్నాయి. కాశ్మీర్ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం. అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. పీవోకే గురించి గట్టిగా మాట్లాడుతున్నాం. ఆక్సాయ్ చిన్ మనదే అని, అది చైనా ఆక్రమించిందని పార్లమంటులోనే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. గాల్వన్ లోయ దేశ రక్షణ విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఇది చైనాకు నచ్చడం లేదు. అందుకే ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తోంది’’ అని సీఎం చెప్పారు. మ‌న‌ది శాంతికాముక దేశ‌మ‌ని, అదే స‌మ‌యంలో స‌హ‌నానికీ ఓ హ‌ద్దు ఉంటుంద‌ని, ఎవ‌రైనా మ‌న మీద‌కు వ‌స్తే దీటుగా ప్ర‌తిఘటించాల‌న్నారు సీఎం కేసీఆర్. దేశ ర‌క్ష‌ణ విష‌యంలో రాజీ ప‌డొద్ద‌ని సూచించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో దేశ‌మంతా ప్ర‌ధాన‌మంత్రికి, కేంద్ర ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటార‌ని కేసీఆర్ స్పష్టం చేశారు.

క‌రోనాతో కంపెనీలు చైనాను వ‌దిలి భార‌త్ వైపు

ఇప్పుడు ఆత్మ నిర్భ‌ర భార‌త్ కావాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చార‌ని, కానీ చైనా మాత్రం మ‌నం అన్య నిర్భ‌ర్ భార‌త్‌గానే ఉండాల‌ని కోరుకుటోంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. భార‌త్ ఎద‌గ‌డం చైనాకు ఇష్టం లేద‌ని, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయడం చైనా భరించలేక పోతోంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండి, స్థిరంగా ఆర్థికాభివృద్ధి జరగడాన్ని చైనా ఓర్వలేకపోతోంద‌ని, అందుకే ఈ గొడవలు సృష్టిస్తోంద‌ని అన్నారు. కరోనా వైరస్‌కు చైనాయే కారణమనే ప్ర‌పంచ దేశాలు న‌మ్ముతున్నాయ‌ని, దీంతో అనేక మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు చైనాలో ఉన్న త‌మ యూనిట్ల‌ను త‌ర‌లించాల‌ని, త‌మ పెట్టుబ‌డుల‌ను భార‌త్‌కు మ‌ళ్లించాల‌ని భావిస్తున్నాయ‌ని అన్నారు. భారత్‌లో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు బాగా అమలు అవుతున్నాయ‌ని, దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా బాగా పెరుగుతున్నాయ‌ని, 2014 నుంచి 2017 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 36 బిలియన్ డాలర్ల నుంచి 61 బిలియన్ డాలర్లకు పెరిగాయని చెప్పారు. చైనా నుంచి తీసుకొచ్చి, తెలంగాణలో తమ కంపెనీలు పెట్టడానికి చాలా సంస్థ‌లు ముందుకొస్తున్నాయ‌ని, ఇది డ్రాగ‌న్ కంట్రీకి న‌చ్చ‌డం లేద‌ని, అందుకే ఇక్క‌డ అశాంతి ర‌గిలించాని య‌త్నిస్తోంద‌ని కేసీఆర్ అన్నారు.

చైనా దిగుమ‌తుల‌పై తొంద‌ర‌ప‌డొద్దు

ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితుల్లో చైనా నుంచి వస్తువుల దిగుబడి ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అయితే అది తొందరపాటు చర్య అవుతుందని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాల‌ని, ప్రజలకు అందుబాటు ధరల్లో వస్తువులు దొరకాల‌ని, ముందుగా మనం ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ సూచించారు. ‘‘భారత్ తో చైనా ఘర్షణాత్మక వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు వద్దు. అదే సమయంలో ఎవరికీ తలవంచొద్దు. రక్షణ వ్యవహారాలలో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి. బ్రిటన్ ప్రతిపాదించిన డి 10 గ్రూపులో కలవాలి. ఓరాన్ అలయెన్సులో చేరాలి. హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలి. మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.