బెట్టింగ్ ​యాప్స్​పై కఠినంగా ఉంటం​ ..చట్టాలను సవరిస్తం.. శిక్షలను పెంచుతం: సీఎం రేవంత్

బెట్టింగ్ ​యాప్స్​పై కఠినంగా ఉంటం​ ..చట్టాలను సవరిస్తం.. శిక్షలను పెంచుతం: సీఎం రేవంత్
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించినా వదిలిపెట్టం: సీఎం రేవంత్​
  • చట్టాలను సవరిస్తం.. శిక్షలను పెంచుతం
  • లా అండ్​ ఆర్డర్​ విషయంలో ఎక్కడా రాజీపడం
  •  శాంతి భద్రతల విషయంలో కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నరు
  • బీఆర్​ఎస్​ హయాంలో లాయర్​ దంపతులను నడిరోడ్డుపై చంపినా పట్టించుకోలేదని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ఆన్​లైన్ బెట్టింగ్ యాప్స్​, గేమ్స్​పై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వీటి నిరోధానికి, అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్​ (సిట్) ఏర్పాటు చేస్తామని తెలిపారు. బుధవారం శాసనసభలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్​ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించినా.. ప్రకటనలకు సహకరించినా.. నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం వదలిపెట్టబోదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ‘‘ఇటీవల బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన వారిని పిలిచి పోలీసులు విచారణ చేస్తున్నారు.. కానీ కేవలం ప్రచారం కల్పించేవారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోదని ప్రభుత్వం భావిస్తున్నది. ఆన్​లైన్ ​బెట్టింగ్​యాప్స్​ నిర్వాహకులను, ప్రమోట్ చేసేవాళ్లను, లబ్ధిపొందుతున్నవారిని విచారించి కఠిన చర్యలు తీసుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది’’ అని  అన్నారు. ఇందుకోసం పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుందని, దీంతో అన్ని అధికారాలతో సిట్ ఏర్పాటు చేసి, కఠినంగా వ్యవహరిస్తామని  సీఎం వెల్లడించారు.  2017లో గత  ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్​లు, యాప్​లను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చిందని, కానీ దానిని అమలు చేయడంలో అప్పటి ప్రభుత్వం  నిర్లక్ష్యం వహించిందని తెలిపారు.    

శాంతిభద్రతలపై  అలర్ట్​గా ఉన్నం..

రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారని.. అయితే, ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో దారు ణమైన ఘటనలు జరిగాయని, ఈ సమయంలో సర్కారు తీసుకున్న చర్యలు, వాటి వివరాలపై సభలో చర్చించేందుకు తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. నేరం జరిగిన వెంటనే ప్రభుత్వం వ్యవహరించిన తీరు కీలకమని పేర్కొన్నారు. ఇటీవల రైలులో జరిగిన ఘటనపై ప్రభుత్వం తరఫున తక్షణం స్పందించామని సీఎం రేవంత్​ గుర్తుచేశారు. ‘‘గతంలో ఓఆర్ఆర్​ దగ్గర వెటర్నరీ డాక్టర్​పై జరిగిన ఘటన, అనంతర పరిస్థితులు, పరిణామాలను అందరం చూసినం. అలాగే, వామనరావు న్యాయవాద దంపతులు  స్వయంగా కోర్టుకు వెళ్లి.. తమకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వానికి సంబంధించిన వారే చంపడానికి ప్రయత్నిస్తున్నారని హైకోర్టులో పిటిషన్​ వేశారు. అక్కడ కోర్టులో కూడా వాదించి వస్తుంటే నడిబజార్​లో నరికి చంపారు. ఆనాటి ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. రకరకాలుగా ఆ రోజు కేసులో ఉన్నవారిని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టులో సీబీఐ విచారణ కోసం కేసు వేస్తే.. తమకు ఏమీ అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పాం. చంపాపేటలో ఆరేండ్ల బాలికను గంజాయి మత్తులో రేప్ చేసి చంపితే, నాటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జూబ్లీహిల్స్​లో బాలికను పబ్​లో నుంచి తీసుకెళ్లి.. రేప్​ చేస్తే దాంట్లో బీఆర్ఎస్​ నాయకుడి కుమారుడే ప్రత్యక్షంగా పాల్గొంటే.. ఆనాడు వాళ్లను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. వక్ఫ్​ బోర్డు చైర్మన్​​ కొడుకు కేసులో ఉన్నారని కేసు పెట్టారు. ఆ రోజు ఉన్న ఒక మంత్రి కుటుంబానికి సంబంధించిన వాళ్లపై వచ్చిన ఆరోపణలు అందరికీ తెలుసు”అని సీఎం అన్నారు. అధికార కాంక్షతో తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 15 నెలల పాలనలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీపడలేదని చెప్పారు.