19 ఏండ్ల తర్వాత కారుణ్య నియామకం

19 ఏండ్ల తర్వాత కారుణ్య నియామకం
  • ఎన్​కౌంటర్​లో మరణించినహెడ్​ కానిస్టేబుల్​ భీమ్ సింగ్​ 
  • సీఎం చొరవతో ఆయన కూతురికి హోంశాఖలో జూనియర్​ అసిస్టెంట్​ ఉద్యోగం

హైదరాబాద్, వెలుగు: 19 ఏండ్లపాటు కారుణ్య నియామకం కోసం ఎదురుచూసిన ఓ మహిళ కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. హోం శాఖలో జూనియర్  అసిస్టెంట్​గా ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్​ రెడ్డి మంగళవారం నియామక ఉత్తర్వులు ఇచ్చారు. వరంగల్​కు చెందిన హెడ్ కానిస్టేబుల్  భీమ్ సింగ్  1996 సెప్టెంబర్​24న నక్సల్స్​తో జరిగిన ఎన్ కౌంటర్​లో అమరులయ్యారు. తండ్రి మృతితో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు బి.రాజశ్రీ దరఖాస్తు చేసుకున్నారు.

 కానీ, వివిధ సాంకేతిక కారణాలు చూపుతూ గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె సమస్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం.. ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని సీఎంఓ అధికారులకు సూచించారు. దీంతో ఆమెను హోం శాఖలో జూనియర్  అసిస్టెంట్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజశ్రీ తన కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్​ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాజశ్రీ వెంట వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కూడా ఉన్నారు.