
హైదరాబాద్, వెలుగు: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే రెండేండ్లలో (2027 జూన్ నాటికి) కృష్ణా నదిపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం నిర్ణీత గడువుతో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. జలసౌధలో బుధవారం నిర్వహించిన రివ్యూలో రేవంత్ మాట్లాడారు.కృష్ణా బేసిన్ లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.
సూదిని జైపాల్ రెడ్డి పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు మొదటి ప్రాధాన్యతతో 18 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కోయిల్ సాగర్ లిఫ్ట్ ను కూడా వచ్చే ఏడాది జూన్ లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహాత్మగాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జహహర్ నెట్టెంపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేయాలన్నారు. వీటికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు, కావాల్సిన నిధుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.