
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో కీలక అడుగుపడింది. పేదలకు రూ.5లక్షలతో 100 శాతం సబ్సిడీతో ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు చేస్తోంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లను, సీఎం కోటాలో మరో 33,500 ఇళ్లను కేటాయించారు. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నారు. స్కీమ్ స్టార్ట్ చేసిన ఆరునెలల్లోపే ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది జనవరి 26న మండలానికి ఒక గ్రామాన్ని మోడల్ విలేజ్ గా సెలక్ట్ చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేశారు. అనంతరం నారాయణ పేట జిల్లా అప్పక్కపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్ధాపన చేశారు. మార్చి నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. ఏప్రిల్ 15న ఎంపిక చేసిన 12 మంది లబ్ధిదారులకు తొలిదశ సాయం కింద లక్ష రూపాయలను చెక్కురూపంలో సీఎం అందజేశారు. సెప్టెంబర్ 1 నాటికి మొత్తం 3,18, 574 ఇళ్లను మంజూరు చేశారు. 2,05,297 ఇళ్ల పనులు స్టార్ట్ కాగా 97,154 బేస్మెంట్ పూర్తయ్యాయి. ఇందులో 11,607 ఇళ్ల గోడలు పూర్తికాగా 5,885 ఇళ్లు స్లాబ్స్ పూర్తయ్యాయి. వంద ఇళ్లు గృహప్రవేశానికి రెడీ అయ్యాయి. ప్రజాపాలనలో ఇళ్లకు మొత్తం 80 లక్ష మంది అప్లయ్ చేసుకోగా ఇందులో 65 లక్షల మంది అర్హులుగా నిర్ధారించారు. ఇళ్లను ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగిరిలుగా ప్రభుత్వం డివైడ్ చేసింది. తొలిదశలో సొంత జాగా ఉన్నవారికి ఇళ్లను మంజూరు చేసింది. ఎల్ 2లో సొంత జాగా లేనివారిని చేర్చారు. వీరికి రెండో దశలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ప్రతి సోమవారం సాయం బదిలీ
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌కు మొదటి నుంచీ నిధుల కొరత రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ప్రభు త్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం సాయం అందటం ఆలస్యమైతే ఇంటి నిర్మాణం ఆగటంతోపాటు ప్రజల్లో స్కీమ్‌పై తప్పుడు అభిప్రాయం వస్తుందని భావించి నిధులు కొరత లేకుండా చర్చలు చేపట్టింది. ఏప్రిల్ 15 నుంచి ప్రతి సోమవారం గ్రీన్ ఛానల్ ద్వారా ఇంటి నిర్మాణంలో బేస్మెంట్, గోడలు, స్లాబ్, ఫినిషింగ్ పూర్తిచేసిన లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలకు సాయంను బదిలీ చేస్తోంది. గత నెల 31 వరకు లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ సాయం రూ.1000 కోట్లు దాటింది. హడ్కో లోన్, రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లు, ఖాళీ జాగాలు అమ్మటంతోపాటు బడ్జెట్లో కేటాయించిన నిధులును లబ్ధిదారులకు అందజేస్తోంది.
ఫెయిల్ అయిన డబుల్ బెడ్రూమ్ స్కీం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌ను స్టార్ట్ చేసింది. ఇందులో గ్రేటర్ లో, ఇతర జిల్లాల్లో మొత్తం 2,72,000 లక్షల ఇళ్లను మంజూరు చేయగా 8 ఏళ్లలో మొత్తం లక్ష ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవటం, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. అలాంటి తప్పులు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని స్కీమ్ అమలు చేస్తోంది.
కేంద్ర సాయం జీరో
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు సాయం అందలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ. 72 వేలు, పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలను పీఎం ఆవాస్ యోజన కింద అందజేస్తోంది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో ఒక లక్ష 13 వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. కానీ, సాయం మాత్రం అందలేదు. రూరల్ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సర్వే పూర్తి చేసినప్పటికీ మళ్లీ తమ నిబంధనల మేరకు సర్వే చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు 2 లక్షల ఇళ్ల సర్వే పూర్తి అయినప్పటికీ కేంద్రం సాయం అందజేయలేదు.
- శ్రీకాంత్ రెడ్డి గార్లపాటి,
సీనియర్ జర్నలిస్ట్