
- మతం ముసుగులో అడ్డుకుంటున్నరు: సీఎం రేవంత్‌రెడ్డి
- అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేస్తున్నరు
- కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది
- బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే?
- గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం
- తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ చెప్పి అమలు చేశారు
- బీసీ రిజర్వేషన్లకు రాహుల్ మాట ఇచ్చారు.. అమలు చేసి తీరుతం
- తెలంగాణలోనూ ఓట్‌చోరీకి కుట్రలు జరగొచ్చు.. జాగ్రత్తగా ఉండాలి
- ఖిలాషాపూర్‌ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడి
- రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు హాజరు
హైదరాబాద్, వెలుగు: మతం ముసుగులో బీసీల రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాదా? మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేవు. అలాంటిది ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నరు?” అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని.. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చి అమలు చేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సూచనల మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సైతం అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి వేడుకలను సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆర్ఎస్ ఎస్ హెడ్డాఫీస్ ఉన్న నాగ్ పూర్‌తోపాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో బీసీలలో ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించగలరా? 56 ఏండ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయి. మతం ముసుగులో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని బీజేపీ చూస్తున్నది” అని పేర్కొన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలని ఎక్కడా లేదని, ఒకవేళ ఉంటే సుప్రీంకోర్టు వెంటనే కొట్టి వేస్తుందని తెలిపారు.
బహుజనులు రాజ్యాధికారం సాధించాలి
విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘మీకు నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది” అని తెలిపారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన పంచాయతీ రాజ్ చట్టం – 2018 బీసీలకు శాపంగా మారిందని, అది బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా మారిందన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని ఆ చట్టంలో ఉందని తెలిపారు. ‘‘సెప్టెంబర్ 30 కల్లా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అందుకే ఆ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపితే.. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. అసెంబ్లీలో పాస్ చేసిన బీసీ బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 5 నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశాం. దేశవ్యాప్తంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వంద మంది ఎంపీలు వచ్చి మా ధర్నాకు మద్దతు తెలిపారు. కానీ.. బీజేపీ, బీఆర్ఎస్ ఆ ధర్నాకు ఎందుకు రాలేదు?” అని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నదని కిషన్ రెడ్డి, మోదీనేనని మండిపడ్డారు. బీసీ బిల్లులను ఆమోదించాలని మోదీ, కిషన్ రెడ్డి రాష్ట్రపతికి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీకి రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపై చూపాలి కానీ, ఆయన సిద్ధాంతాలపై కాదన్నారు.
ఖిలాషాపూర్‌ను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతం
మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేసేది వర్ధంతులు, జయంతుల కోసం కాదని.. వారి స్ఫూర్తిని రగిలించిందుకేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ విగ్రహాల దగ్గరి నుంచి వెళ్తున్న సమయంలో వారి త్యాగాలు, పోరాటాలు గుర్తుకురావాలని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందుకే రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సెక్రటేరియెట్ సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ‘‘ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. పాపన్నకు గుర్తింపు రావాలని దశాబ్దాల నుంచి డిమాండ్ ఉంది. గత ప్రభుత్వం ఆయన గ్రామమైన ఖిలాషాపూర్ కోటను మైనింగ్ లీజుకు అప్పగించింది.
పీసీసీ చీఫ్ హోదాలో నేను పాదయాత్ర చేసినప్పుడు.. అధికారంలోకి వచ్చాక ఈ కోటను, ఈ గ్రామాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని పొన్నం ప్రభాకర్ కోరగా అంగీకారం తెలిపాను. కోటపై ఉన్న ఒక్క రాయిని కూడా తీయొద్దని ఆదేశించాను. ఇప్పుడు టూరిజం స్పాట్‌గా కోటను, గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం” అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించిందని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని తెలిపారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని, గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనమని చెప్పారు. ‘‘2004లో తెలంగాణ ఇస్తామని కరీంనగర్లో సోనియాగాంధీ ప్రకటించి.. ఇచ్చినమాటను నిలబెట్టుకున్నారు. జోడో యాత్ర లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు కులగణన చేసి దేశానికి ఆదర్శంగా, రోల్ మోడల్‌గా తెలంగాణ మారింది. మా ప్రభుత్వానికి బీసీలు అండగా నిలవాలి” అని ఆయన కోరారు.
రాహుల్ పాదయాత్రలో పాల్గొంట
తెలంగాణలో కూడా దొంగ ఓట్లకు కుట్ర జరిగే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఇక్కడ ఎన్నికల్లో గెలవలేమని వాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది.. అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతున్నది. బిహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రలను రాహుల్ గాంధీ బయటపెట్టారు . తప్పు చేసినవారిని వదిలేసి.. తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడగడం ఎంతవరకు న్యాయం?” అని ఆయన ప్రశ్నించారు. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని.. త్వరలో తాను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
కులగణన, రిజర్వేషన్లతో సీఎంను రేవంత్ గౌడ్ అంటున్న: మహేశ్ గౌడ్
కులగణన చేయటం చరిత్రాత్మకమని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేసిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. “సభకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన రేవంత్ గౌడ్ అని అంటున్న. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం చెప్పిన. కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపినందుకు సీఎంను రేవంత్ గౌడ్ అంటున్న” అని ఆయన పేర్కొన్నారు. సాహసానికి ధైర్యానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న అని, సామాన్య కుటుంబంలో జన్మించిన పాపన్న అప్పటి భువనగిరి ఖిల్లాతో పాటు ఔరంగజేబు ఆధీనంలో ఉన్న గోల్కొండ ఖిల్లాను కైవసం చేసుకున్నారని తెలిపారు. ‘‘సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేసి సత్కరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. విగ్రహ ఏర్పాటుకు హైదరాబాద్‌లో 3 ప్లేస్‌లు నేను, మంత్రి పొన్నం చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియెట్ వద్ద ప్లేస్‌ను ఎంపిక చేశారు. ఆరు నెలల్లో పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు” అని మహేశ్ గౌడ్ వివరించారు. ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు.
మా పీసీసీ చీఫ్ నన్ను రేవంత్ గౌడ్ అంటున్నరు
“మాదిగ సోదరులు నాకు సభ్యత్వం ఇచ్చారు. ఇప్పుడు మా పీసీసీ చీఫ్ నన్ను రేవంత్ గౌడ్ అంటున్నారు. మా మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ నన్ను ముదిరాజ్ అని అన్నారు” అని సీఎం రేవంత్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని పనిని తెలం గాణలో తాము చేసి చూపించామని.. కులగణన కోసం తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నో మీటింగ్‌లు నిర్వహించామని.. అన్ని బీసీ సంఘాలతో సమావేశమై డిప్యూటీ సీఎం సలహాలు, సూచనలు తీసుకున్నారని.. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించామని ఆయన వివరించారు.
సెక్రటేరియెట్ వద్ద పాపన్న గౌడ్ విగ్రహం
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సోమవారం సెక్రటేరియెట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆరునెలల్లో విగ్రహాన్ని ఆవిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లు సాధించేదాకా పోరాడుదాం: మంత్రి పొన్నం ప్రభాకర్
బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం చేశారని, బీసీల రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీలంతా ఐక్యంగా పోరాటం చేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ‘‘సర్వాయి పాపన్న చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసేలా విగ్రహ ఏర్పాటు కోసం సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేశారు. సామాజిక న్యాయం కోసం ఆనాడు సర్వాయి పాపన్న ఉద్యమించినట్టు.. ఈనాడు బీసీల రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాజకీయాలకు మాత్రమే కాదు విద్య ఉద్యోగాల్లోనూ ఉంటాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యను మనం అందిస్తే భవిష్యత్ తరాలను నిర్మించినట్టే” అని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ మధుయాష్కీ, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక విప్లవానికి తెలంగాణ ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి
సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశంలోనే చర్చకు దారితీసింది. కేంద్రం అనివార్యంగా కులగణనను చేపట్టాల్సిన పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ప్రతి బహుజనుడు ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలి” అని కోరారు. బహుజన బిడ్డలు భవిష్యత్తులో ఫలాలు పొందేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడాలన్నారు. ‘‘సర్దార్ సర్వాయి పాపన్న పోరాట మార్గం, పోరాట స్ఫూర్తి అందరికీ గుర్తుకువచ్చే విధంగా సెక్రటేరియెట్ వద్ద విగ్రహం ఏర్పాటు చేస్తున్నది. సామాజిక న్యాయానికి, ధర్మానికి పాపన్న విగ్రహం పునాది. ఏమీ లేని రోజుల్లోనే పాపన్న అన్ని కులాలను కలుపుకొని అనుకున్నది సాధించారు. ఆయన మార్గంలో మనందరం అడుగులు వేయాలి” అని డిప్యూటీ సీఎం సూచించారు.