నీటి తరలింపు ఆపాలె.. కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

నీటి తరలింపు ఆపాలె.. కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
  • ముచ్చుమర్రి, హంద్రీనీవా నుంచి నీటి తరలింపు ఆపాలె
  • కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంపై కట్టిన ముచ్చుమర్రి, హంద్రీనీవా లిఫ్ట్ స్కీంల నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని, ఆ తరలింపును ఆపాలని కేఆర్​ఎంబీని తెలంగాణ కోరింది. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ గురువారం కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ కు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు దిగువనున్న బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్‌‌లోని ఎస్కేప్ చానెల్ ద్వారా కేసీ కెనాల్‌‌కు నీళ్లివ్వకుండా  కట్టడి చేయాలని కోరారు. సుంకేసుల ద్వారా తుంగభద్ర నీటిని కేసీ కెనాల్​కు తరలించాలని, కానీ, దానికి విరుద్ధంగా ఆ 3 ప్రాజెక్టుల నుంచి తరలిస్తోందని ఆరోపించారు.  సుంకేసుల నుంచి కేసీ కెనాల్ కు 39.90టీఎంసీల కేటాయింపులు ఉండగా, ఏటా 54 టీఎంసీలకు పైగా నీటిని తరలిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు మద్రాస్ స్టేట్, హైదరాబాద్ నిజాం సంస్థానం ఉన్నప్పుడు సుంకేసుల, ఆర్డీఎస్ ఆనకట్ట నిర్మాణానికి ఒప్పందం జరిగిందని, సుంకేసులకు 10 టీఎంసీలు, ఆర్డీఎస్ కు 15.90 టీఎంసీలు కేటాయించారని గుర్తు చేశారు. 10 టీఎంసీల వినియోగానికి మాత్రమే సుంకేసుల నిర్మించాల్సి ఉండగా, 17 టీఎంసీలు తరలించుకునేలా కట్టారని తెలిపారు. 

ఆర్డీఎస్​పై తీవ్ర నిర్లక్ష్యం
ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, దీంతో కేటాయించిన 15.90 టీఎంసీల్లో 5 టీఎంసీలు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందని మురళీధర్​ తెలిపారు. శ్రీశైలం జలాశయం నుంచి 798 అడుగుల లెవల్ లో నీటిని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముచ్చుమర్రి లిఫ్ట్ కట్టిందని తెలిపారు. దీని ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటిని తరలిస్తోందని పేర్కొన్నారు. ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్), ఎస్కేప్ చానెల్ ద్వారా కేసీ కెనాల్ కు నీటిని తరలించడం చట్ట విరుద్ధమని, వెంటనే కృష్ణా బోర్డు జోక్యం చేసుకొని నీటి అక్రమ తరలింపును ఆపేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ ప్రభుత్వం గతంలోనే కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసే వరకు నీళ్లు మళ్లించకుండాచర్యలు తీసుకోవాలని కోరారు.