ఇవాళ (జూలై 25న) రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల చలో ఢిల్లీ

ఇవాళ (జూలై 25న)  రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల చలో ఢిల్లీ
  • నేడు కాంగ్రెస్ ఓబీసీ సమ్మేళనం
  • చీఫ్ గెస్టులుగా హాజరుకానున్న ఖర్గే, రాహుల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు గురువారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. పార్టీలోని వివిధ స్థాయిల్లోని నేతలు సుమారు 300 మంది వరకు తరలివెళ్లారు. శుక్రవారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఏఐసీసీ ఓబీసీ సమ్మేళనం జరగనుంది. దీనికి చీఫ్ గెస్టులుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చ జరగనుంది. 

ఇతర రాష్ట్రాల్లోని పార్టీ నేతలకు దీనిపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందులో పాల్గొనేందుకు గురువారం రాష్ట్ర బీసీ నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. వీరిలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, పీసీసీ కార్యవర్గంలోని బీసీ నేతలు, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ల బీసీ చైర్మన్ లు, డీసీసీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ, టెంపుల్ కమిటీల బీసీ చైర్మన్ లు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. 

ఇక పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లారు. దేశ వ్యాప్తంగా ఓబీసీలను ఏకం చేయడం కోసం, వారికి కులగణనపై అవగాహన కల్పించి, జాతీయ రాజకీయాల్లో బీసీ నేతల పాత్రపై ఇందులో చర్చించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్  చెప్పారు. సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ లోని బీసీ నేతలకు మంత్రి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.