
వెలుగు: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, అధిక వ్యయం జరుగుతున్నాయని, వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు పాదయాత్రలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. దసరా తర్వాత ప్రాజెక్టుల వద్ద నుంచే పాదయాత్రలు నిర్వహించాలని, వాస్తవాలను జనాలకు అర్థమయ్యే రీతిలో ఆధారాలతో సహా వివరించాలని తీర్మానం చేశారు. నేతలు ఎక్కడిక్కడ తమ ఏరియాలోని ప్రాజెక్టుల నుంచి పాదయాత్రలు ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. శనివారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై నేతలు చర్చించారు. ప్రాజెక్టులపై సాగునీటి రంగ నిపుణుడు నైనాల గోవర్ధన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పలు సూచనలు చేశారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులపై జనాలకు వాస్తవాలు తెలియజెప్పాలని, ఇందుకోసం ప్రాజెక్టులను సందర్శించి, అక్కడి నుంచే పాదయాత్రగా జనాల మధ్యకు వెళ్లాలని చెప్పారు. అధికార పార్టీ చేస్తున్న అవినీతిని, అడ్డగోలుగా ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా జనానికి వివరించాలన్నారు. హైదరాబాద్ లో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, కోర్టుల్లో కేసులు వేయడం వల్ల ఫలితం ఉండదని, జనంలోకి వెళితేనే మేలని జీవన్‌రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు తాను పాదయాత్ర చేస్తానని చెప్పినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనకు ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు మద్దతు ప్రకటించినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల నుంచి జిల్లాల వారీగా నేతలు పాదయాత్రలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
మున్సిపల్ ఎన్నికలకు కార్యాచరణ
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా వ్యూహాలు అమలు చేయాలని పీసీసీ భేటీలో తీర్మానించారు. మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పార్టీ పదవులను వెంటనే భర్తీ చేయాలని, పార్టీ కమిటీలు లేనిచోట సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలని నిర్ణయించారు. జులై 1 నుంచి 4 వరకు కొత్త జిల్లాలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయి. 6, 7, 8 తేదీల్లో మున్సిపాలిటీల పరిధిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చే అధికారం పీసీసీ అధ్యక్షుడిదే అయినా.. క్యాండిడేట్ల ఎంపిక, బీఫారాలు ఏవిధంగా ఇవ్వాలనే దానిపై చర్చించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిన నేతలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, సదరు మున్సిపాలిటీ లేదా నియోజకవర్గానికి చెందిన పీసీసీ ఆఫీస్ బేరర్లు, ఇతర ముఖ్య నాయకులతో కమిటీలు వేయాలని నిర్ణయించారు.
త్వరలో పార్టీ పదవుల భర్తీ
ఏఐసీసీ సభ్యులు, పీసీసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు తదితర పార్టీ పదవుల్లో ఖాళీగా ఉన్న వాటిని వెంటనే భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరమని, పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగాలని తీర్మానం చేశారు. సీఎల్పీ విలీనం, రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం చర్చకు రాలేదు.
డుమ్మా కొట్టిన సీనియర్లు
సాగర్ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, అజారుద్దీన్, సంపత్ కుమార్, వంశీ చంద్ తదితరులు రాలేదు. ఇక తమ సోదరుడి కుమారుడు, ఏఐసీసీ మెంబర్ రమేశ్ మరణించడంతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మల్లు రవి కూడా గైర్హాజరయ్యారు. భేటీలో రమేశ్ మృతికి సంతాపం ప్రకటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
మాపై మరొకరి పెత్తనమేంటి?
మున్సిపల్ ఎన్నికలకు ఇన్చార్జులను నియమించే అంశంపై చర్చ జరిగినప్పుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహనం కోల్పోయి నోరుజారారని, తర్వాత సారీ చెప్పారని తెలిసింది. ఈ అంశంపై జగ్గారెడ్డి మాట్లాడుతూ..‘‘మా ప్రాంతంలో ఎవరో ఇన్చార్జిగా వచ్చి పెత్తనం చేస్తామంటే కుదరదు. ఖర్చు పెట్టుకునేది, కష్టపడేది మేమైతే.. మరొకరి పెత్తనం ఏమిటి?”అన్నట్టు సమాచారం. దీనిపై మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి వెంటనే స్పందించి.. ‘పార్టీకి నీవొక్కడివే పని చేస్తున్నట్టు మాట్లాడడమేంటి’’అని నిలదీసినట్టు తెలిసింది. దీంతో ఎవరైనా తన మాటలకు నొచ్చుకుంటే క్షమించాలని జగ్గారెడ్డి పేర్కొన్నట్టు సమాచారం.
రేవంత్ రాజీనామా!
రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ గా కొనసాగాలంటూ సాగర్ పీసీసీ సమావేశంలో తీర్మానంపై చర్చించారు. రాహుల్ కొనసాగాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామాలు చేస్తున్నారని, తానూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.