ప్రజల సలహాలతోనే  కాంగ్రెస్ ​మేనిఫెస్టో !

ప్రజల సలహాలతోనే  కాంగ్రెస్ ​మేనిఫెస్టో !
  • జనాల ఒపీనియన్​ తీసుకోవాలని పార్టీ నేతల నిర్ణయం
  • వారి సూచనలతోనే హామీలను పొందుపర్చాలని యోచన
  • గాంధీభవన్​లో కంట్రోల్​ రూం, టోల్​ ఫ్రీ నెంబర్​ ఏర్పాటు

హైదరాబాద్​, వెలుగు:  ప్రజలకు మేలు చేసేలా, అమలు చేయగలిగే పథకాలు, హామీలనే మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించింది. ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ మంగళవారం గాంధీభవన్​లో తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఇప్పటికే వివిధ వర్గాల కోసం డిక్లరేషన్లను ప్రకటించిన పార్టీ.. మేనిఫెస్టోలో పెట్టాల్సిన ఎన్నికల హామీలపై నేరుగా ప్రజల నుంచే అభిప్రాయం తీసుకోవాలని నిర్ణ యించినట్టు తెలిసింది. జనాలకు ఏం కావాలో వారినే అడిగి తెలుసుకోవాలని యోచిస్తున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రజలు చెప్పిన వాటిని పరిశీలించి మేనిఫెస్టోలో పొందుపర్చాలని నేతలు అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు గాంధీభవన్​లోనే మేనిఫెస్టో కంట్రోల్​ రూమ్, టోల్​ఫ్రీ నంబర్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. హామీలు ఎలా ఉండాలన్న దానిపై కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్​ నేతలు చర్చించారని చెప్తున్నారు. విజయభేరి సభలో ఐదు గ్యారెంటీలే కాకుండా.. ఇంకెన్ని హామీలు అమలు చేస్తే బాగుంటుందో చర్చించినట్టు తెలుస్తున్నది. 

ప్రజల జీవితాలను మార్చేలా ఉంటది: శ్రీధర్​ బాబు

కాంగ్రెస్​ మేనిఫెస్టో ప్రజల జీవితాలను మార్చేలా ఉంటుందని మేనిఫెస్టో కమిటీ చైర్మన్​ దుద్దిళ్ల శ్రీధర్​ బాబు చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో విషయాలను సీనియర్​ నేతలు చెప్పారని, పలు సూచనలు చేశారని తెలిపారు. హామీలకే పరిమితం కాకుండా మేనిఫెస్టో రూపొందించాలని సూచించారన్నారు. 

రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటారో అదే మేనిఫెస్టోలో ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలూ వారి సలహాలు ఇవ్వాలన్నారు. శాస్త్రీయ పద్ధతిలోనే తమ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. బుధవారం కూడా మరోసారి మేనిఫెస్టో కమిటీ సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు.