ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు

హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్‌‌, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్‌‌ బి.సుదర్శన్‌‌ రెడ్డి బరిలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్కు ముందు సీఎం రేవంత్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేశారు.

కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వినియోగించుకున్నారు. ఆయన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ అధికారం కలిగిన వ్యక్తి ఉప రాష్ట్రపతి. ఆయన రాజ్యసభకు ఎక్స్- అఫిషియో చైర్‌‌పర్సన్‌‌గా కూడా ఉంటారు. కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికలో లోక్ సభ, రాజ్య సభ సభ్యులు ఓటు వేస్తారనే విషయం విదితమే. పలు ఖాళీల తర్వాత.. ప్రస్తుతం లోక్ సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది సభ్యులు కలిపి మొత్తం 781 మంది ఉన్నారు. 

అయితే, రాష్ట్రపతి అభ్యర్థి గెలుపొందాలంటే.. మ్యాజిక్ ఫిగర్ కనీసం 391 ఓట్లు అవసరం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 425 మంది సభ్యుల మద్దతు ఉంది. అలాగే, బయటి నుంచి వైసీపీ మద్దతు ఇస్తున్నది. రాజ్యసభ, లోక్ సభలో వారికి 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఇండియా కూటమి సంఖ్యా బలం 325గా ఉంది.