కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. సెప్టెంబర్​లోనే

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..  సెప్టెంబర్​లోనే
  • 50 మందితో ప్రకటించే అవకాశం 
  • టికెట్ల కోసం మూడ్రోజుల్లో 35 దరఖాస్తులే 
  • 25 వరకు గడువు.. చివరి రెండ్రోజుల్లో ఎక్కువొచ్చే చాన్స్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తున్నది. టికెట్ ఆశిస్తున్నోళ్ల దగ్గరి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని, వాటిని వడబోసి సర్వేల ఆధారంగా టికెట్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నది. బీఆర్ఎస్ లిస్ట్​రిలీజ్​అయ్యాక, ఆ పార్టీ అభ్యర్థులను బట్టి తమ జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ మొదలైనందున సెప్టెంబర్​ రెండో వారంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం పూర్తి కాగానే, అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. తొలి జాబితాలో 40 నుంచి 50 మంది పేర్లు ఉండొచ్చని పార్టీ సీనియర్​నేత ఒకరు చెప్పారు. 

వేగం పుంజుకోని దరఖాస్తులు..

టికెట్ల కోసం ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకోకుండా, పోటీపై సీరియస్​గా ఉండే నేతలే దరఖాస్తు చేసుకునేలా కాంగ్రెస్ అప్లికేషన్​ఫీజు పెట్టింది. కొన్ని చోట్ల మినహా మిగతా నియోజకవర్గాల్లో పార్టీకి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఆశావహులు ఉన్నారు. శుక్రవారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ  మొదలైంది. అయితే ప్రస్తుతం అప్లికేషన్లు పెద్దగా రావడం లేదు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై మూడ్రోజులవుతున్నా, కేవలం 35 వరకే వచ్చాయి. ఈ నెల 25 వరకు గడువు ఉన్న నేపథ్యంలో  చివరి రెండు మూడు రోజుల్లో అప్లికేషన్లు భారీగా వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో తమకే టికెట్ ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నారు. సర్వేల పేరు చెప్పి తమను కాదంటే, ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చి, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి మొండి చెయ్యి చూపించొద్దని పార్టీ పెద్దల వద్ద స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. 

కర్నాటక తరహాలో ‘గ్యారంటీ కార్డ్’ ప్రచారం​

ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేలా కాంగ్రెస్ ‘గ్యారంటీ కార్డ్’​ ప్రచారాన్ని ప్రారంభించనుంది. కర్నాటక తరహాలోనే ప్రతి ఇంటికీ గ్యారంటీ కార్డును పార్టీ నేతలు అందించనున్నారు. పార్టీ చేపట్టనున్న సంక్షేమ పథకాలు, హామీలను ఆ కార్డుల్లో పొందుపరచనున్నారు. రుణమాఫీ, పింఛన్లు, ఉద్యోగాలు తదితర అంశాలను వాటిల్లో పెట్టి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని యోచిస్తున్నారు. రానున్న రెండు నెలల పాటు నేతలు గ్రౌండ్​లెవెల్​లోనే ఉండేలా పార్టీ కసరత్తు చేస్తున్నది.