మునుగోడులో కొత్త వ్యక్తిని దించే ఆలోచన లేదు

మునుగోడులో కొత్త వ్యక్తిని దించే ఆలోచన లేదు

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై తనను సీఎం కేసీఆర్ సంప్రదించలేదని తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.  కొత్త వ్యక్తిని దించే ఆలోచన లేదనే సమాచారం ఉందని, ఈ సారికి పాత వ్యక్తులకే అవకాశం అన్నట్లు తెలుస్తోందన్నారు. హైదరాబాద్ లోని కౌన్సిల్​లో బుధవారం ఆయన విలేకరులతో వివిధ అంశాలపై చిట్​చాట్ చేశారు. మునుగోడులో బీజేపీకి బలం లేదని, రాజగోపాల్ కు ఉన్న బలంతోనే సభకు జనం వచ్చారని తెలిపారు. మునుగోడులో ఇప్పటికైతే కాంగ్రెస్, టీఆర్​ఎస్​ మధ్యే పోటీ నడుస్తోందన్నారు. రాజాసింగ్ కామెంట్లు అంతర్జాతీయ ఇష్యూ అని, సెక్యులర్ దేశంగా ఉన్న ఇండియా మారుతోందనే ప్రచారం జరిగే ప్రమాదముందని హెచ్చరించారు.

ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఎట్లుంటదని ఆయన ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ఉపఎన్నిక వచ్చినా తన పేరు ప్రచారంలో ఉంటుందని సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నికతో రాజగోపాల్ రెడ్డి మునుగుతడని, కోమటిరెడ్డి వెంకటరెడ్డినికూడా ముంచుతాడని చెప్పారు. సర్వేల్లో కూసుకుంట్లకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయని, కొన్ని చోట్ల వ్యతిరేకత ఉండడం సహజమేనని అన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మతతత్వ పార్టీలకు చోటు ఉండదన్నారు.