- హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అవినీతి ఆగడం లేదని, ప్రీమియర్ లీగ్ పేరుతో మరో మోసం చేయాలని చూస్తే అడ్డుకుంటామని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) నేతలు హెచ్చరించారు. తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను టీసీఏనే నిర్వహిస్తుందని ప్రకటించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్‌లో శుక్రవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు.
అండర్-14 సెలక్షన్ పేరుతో హెచ్ సీఏ భారీ అవకతవకలకు పాల్పడి 3,500 మంది చిన్నారులను, వారి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. బీసీసీఐలో అండర్-14 విభాగమే లేదని, జింఖానా గ్రౌండ్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిపారు. కేవలం 15 మందిని ఎంపిక చేయడానికి వేలాది మందిని నిలబెట్టారన్నారు.
హెచ్‌సీఏ అవకతవకలపై హ్యూమన్ రైట్స్, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, ఎన్నిసార్లు కోర్టు మందలించినా మార్పు రాలేదని, మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని టీసీఏ జనరల్ సెక్రటరీ గురువా రెడ్డి తెలిపారు. హెచ్‌సీఏపై సీఎం సుమోటో విచారణ జరపాలని, ప్రభుత్వం, బీసీసీఐ కలిసి చర్యలు తీసుకుని టీసీఏకి గుర్తింపు ఇవ్వాలని ప్రేమ్ చంద్ డిమాండ్ చేశారు.

